విజయనగరం టౌన్: క్రీడాస్ఫూర్తిని నిజ జీవితానికి ప్రతి ఒక్కరూ అనుసంధానం చేసుకోవాలని ఎస్పీ ఏఆర్.దామోదర్ సూచించారు. ఈ మేరకు సారిపల్లిలోని జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందుతున్న ట్రైనీకానిస్టేబుల్స్‌లో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు నిర్వహించిన స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ముగింపు వేడుకలను పరేడ్ గ్రౌండ్‌లో గురువారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ మాట్లాడుతూ నిబంధనలకనుగుణంగా క్రీడాస్ఫూర్తితో సమష్టిగా, ఒకరితో మరొకరు సమన్వయం చేసుకుని ఆడుతూ విజయం సాధించాల్సి ఉంటుందన్నారు. అదేరకమైన స్ఫూర్తిని నిజజీవితంలో కూడా ప్రదర్శించి, చట్టాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించి, క్రమశిక్షణ కలిగిన పౌరులుగా,ఉద్యోగిగా ప్రవర్తించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. క్రీడాస్ఫూర్తితో నిబంధనలు పాటిస్తూ, సమష్టిగా సమన్వయంతో ఆడి ఎలాగైతే విజయం సాధిస్తామో, అదేవిధంగా మనం వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చినప్పటికీ విధినిర్వహణలో ఒకరికొకరు సహాయపడుతూ శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. ఏటా నిర్వహించే రాష్ట్రస్ధాయి పోటీల్లో ప్రతిభ కనబర్చితే అడ్వాన్స్ ఇంక్రిమెంట్స్, సర్వీసులో ప్రోత్సహకాలు ఉంటాయన్నారు. ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ ఆటలో నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. అనంతరం విజేతలకు బహుమతులు, ట్రోఫీలు, మెడల్స్ ప్రదానం చేశారు. ముగింపు వేడుకల్లో అడ్మిన్ ఎస్పీ పి.సౌమ్యలత, ఏఆర్. అదనపు ఎస్పీ పి.కిరణ్‌కుమార్, ఏఆర్ డీఎస్పీ ఈ.కోటిరెడ్డి, మహిళా పీఎస్ డీఎస్పీ పీవీవీ .నరసింహారావు, ఎస్సీ,ఎస్టీ సెల్ డీఎస్పీ ఎం.వీరకుమార్, పలువురు సీఐలు, ఆర్‌ఐలు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
గుర్తు తెలియని యాచకుడి మృతి
కొత్తవలస: మండల కేంద్రంలోని విజయనగరం రోడ్డులో గల బస్‌షెల్టర్‌లో గుర్తు తెలియని యాచకుడు మృతి చెంది ఉండడాన్ని స్థానికులు గమనించారు. మృతుడికి సుమారు 60 సంవత్సరాలు ఉంటాయని అంచనా. ఆయన గత 30 రోజులుగా స్థానికంగా యాచిస్తూ రాత్రి వేళ బస్‌షెల్టర్‌లో ఉంటున్నట్లు స్థానికులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు పంచాయతీ పారిశుధ్య కార్మికులు మృతదేహాన్ని పక్కనే గల శ్మశాన వాటికలో ఖననం చేశారు.


