కలిసికట్టుగా విజయపతాకం ఎగురవేద్దాం | - | Sakshi
Sakshi News home page

కలిసికట్టుగా విజయపతాకం ఎగురవేద్దాం

Sep 18 2026 12:51 AM | Updated on Sep 18 2026 12:51 AM

వైఎస్సార్‌సీపీ శ్రేణులకు బొత్స పిలుపు

కోలాహలంగా సాగిన పార్టీ బొబ్బిలి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం

బొబ్బిలి: కలికట్టుగా నడుద్దాం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ జెండాను ఎగురవేద్దామని పార్టీ శ్రేణులకు శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. బొబ్బిలిలోని ఓ ప్రైవేటు రెసిడెన్సీలో మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చినఅప్పలనాయుడు అధ్యక్షతన గురువారం నిర్వహించిన బొబ్బిలి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశంలో బొత్స మాట్లాడారు. ఆర్థిక లావాదేవీలతో రాజకీయాలు చేస్తున్న వారు, దోచుకోవడానికి, దోపిడీకి అలవాటు పడ్డవారు ఒక్కటయ్యారని విమర్శించారు. మొన్నటి వరకూ అరాచకాలు, ఆర్థిక నేరగాళ్లు అంటూ విమర్శించిన వారిని ‘కోట’లోకి ఎలా రానిచ్చారంటూ ప్రశ్నించారు. ఆర్థిక నేరగాళ్లు ఇప్పుడు మంచోళ్లయిపోయారా? ఇదేనా మీ రాజకీయం? సిగ్గనిపించలేదా అంటూ రాజులను పరోక్షంగా విమర్శించారు. రాజకీయం అంటే సంపాదనకో, ఆస్తులు కాపాడుకోవడానికో కాదని, పేద, మధ్యతరగతి ప్రజలకు భరోసా ఇవ్వడం. మేమున్నామని వారికి జీవనోపాధి కల్పించడం అని హితవు పలికారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర రెడ్డిలా మాట ఇస్తే మడమ తిప్పకూడదన్నారు. వైఎస్సార్‌సీపీ విధానం ఇదేనన్నారు. నాడు రాజన్న, నేడు జగనన్న దానికి నిలువెత్తు నిదర్శనమని స్పష్టం చేశారు. తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వాలని బీజేపీ నిరసనలు చేపడుతోందని, ఏపీలో వెన్నుపోటు పార్టీతో కూటమి కట్టి ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై కిమ్మనడం లేదని, రాజకీయాలంటే ఇలాంటివా అంటూ కూటమి తీరుపై బొత్స మండిపడ్డారు. బొబ్బిలిలో ఎవరి హయాంలో ఎక్కువ అభివృద్ధి జరిగిందో ప్రజలకు తెలుసన్నారు.

కార్డు ఒక భరోసా..

వైఎస్సార్‌సీపీ గ్రామీణ, అర్బన్‌ కమిటీల సభ్యులకు కార్డులిస్తోందని, ఇది సాధారణ కార్డు కాదని, పార్టీ జాతీయ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఇచ్చిన భరోసా కార్డు అని బొత్స స్పష్టం చేశారు. ఏ సమస్య ఎదురైనా ఫోన్‌ చేస్తే స్పందిస్తామన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో కింది స్థాయి నుంచి పై వరకూ అంతా దోపిడీపాలన సాగుతోందని విమర్శించారు. రాష్ట్రంలో కరువులో రైతులు చిక్కుకున్నా ప్రభుత్వం ఆదుకునే చర్యలు తీసుకోవడంలేదన్నారు. ఇక్కడ దొరకని ఎరువులు ఒడిశా, తమిళనాడు, కర్ణాటకలో ఎలా దొరుకుతున్నాయని ప్రశ్నించారు.

● ఎమ్మెల్సీ సురేష్‌బాబు మాట్లాడుతూ వెన్నుపోటు ప్రభుత్వానికి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడల్లా మేనిఫెస్టోలు మార్చడమే తప్ప వాటిని అమలుచేయడం తెలియదని విమర్శించారు. ఒక మేనిఫెస్టోకు మరో మేనిఫెస్టోకు అసలు సంబంధమే ఉండదన్నారు. స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ సత్తా ఏమిటో చూపించి విజయకేతనం ఎగురవేయాలన్నారు.

● డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు అంగీకరిస్తే నారా లోకేశ్‌ రాజమండ్రి సెంట్రల్‌ జైలుకా, విశాఖ సెంట్రల్‌ జైలుకా అన్నది తేలుతుందని, ఉచిత సలహాలు, సవాళ్లు చేసే స్థాయి లోకేశ్‌కు లేదని మాజీ ఎంపీ, పార్టీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్‌ అన్నారు.

● స్థానిక ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా చేసుకుని పార్టీ శ్రేణులన్నీ కలిసి కట్టుగా పోరాడాలని డాక్టర్‌ బొత్స సందీప్‌ కోరారు. వైఎస్సార్‌ సీపీ ప్రజలు, కార్యకర్తల పోరాటం నుంచి వస్తే అధికారంలో ఉన్న టీడీపీ వెన్నుపోటు లోంచి వచ్చిందని యువ నాయకురాలు బొత్స అనూష అన్నారు. ఈ వెన్నుపోటు పార్టీకి ఓటుతో బుద్ధిచెప్పాలని కార్యకర్తలతో చెప్పించారు. సమావేశంలో నియోజవర్గ పరిశీలకుడు రొంగలి జగన్నాథం, వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శంబంగి వేణుగోపాలనాయుడు, రాష్ట్ర మహిళా విభాగం సంయుక్త కార్యదర్శి తూముల అచ్యుతవల్లి, వైద్య విభాగం నాయకులు డాక్టర్‌ బొత్స కాశినాయుడు, ఏఎంసీ మాజీ చైర్మన్‌ బొమ్మి శ్రీనివాసరావు, ట్రేడ్‌ యూనియన్‌ రాష్ట్ర నాయకులు తూముల రామసుధీర్‌, మాజీ మునిసిపల్‌ చైర్మన్‌ ఎస్వీ మురళీ కృష్ణారావు, నాలుగు మండలాల జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, మండల పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీలో చేరిన టీడీపీ కార్యకర్తలు

టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి చేరిన మెట్టవలస, వెలగవలస గ్రామాలకు చెందిన యువత, నాయకులకు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్‌లు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ కోసం కష్టపడండి మీకు పార్టీ అండగా ఉంటుందన్నారు

సెల్ఫీలు తప్ప చేసిన అభివృద్ధి ఏదీ?

నియోజకవర్గంలో రోడ్డుపై సెల్ఫీలు తీసుకుని సోషల్‌ మీడియాలో పోస్టు చేయడం తప్ప రాజులు చేసినది శూన్యమని మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు విమర్శించారు. వైఎస్సార్‌సీపీ హయాంలో చేసిన అభివృద్ధి పనులే ఇప్పుడు నియోజకవర్గంలో కనిపిస్తున్నాయన్నారు. ప్రలోభాలకు గురిచేసి మున్సిపల్‌ చైర్మన్‌ పదవిని లాక్కోవడం తప్ప కొత్తగా చేసిన ఒక్క అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమం కనిపించదన్నారు. రైతుల కరువు పరిస్థితులు ప్రభుత్వానికి కనిపించడంలేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement