● సిబ్బందికి ఎస్పీ ఏఆర్.దామోదర్ ఆదేశాలు
విజయనగరం టౌన్: జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్‌లలో నమోదైన కేసుల్లో నిందితులకు న్యాయస్ధానాల్లో శిక్షలు పడే విధంగా చేయడంలో కోర్టు కానిస్టేబుళ్లు, కోర్టు మానిటరింగ్ సిబ్బంది పాత్ర క్రియాశీలకమని ఎస్పీ ఏఆర్.దామోదర్ స్పష్టం చేశారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న ఎస్సైలు, సీఐలు, కోర్టు కానిస్టేబుళ్లు, కోర్టు మానిటరింగ్ సిబ్బందితో జూమ్ మీటింగ్‌ను గురువారం ఎస్పీ నిర్వహించారు. వారు నిర్వహించాల్సిన విధులు, న్యాయస్ధానాల్లో వ్యవహరించాల్సిన తీరుపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వివిధ కేసుల్లో నిందితులు అరెస్టు అయిన సమయంలో పూర్తి వివరాలను సంబంధిత ఎస్సైలు రిజిస్టర్‌లో నమోదుచేయాలని సూచించారు. న్యాయస్ధానాలు, పోలీసు స్టేషన్‌ల మధ్య కోర్టు కానిస్టేబుళ్లు, సీఎంఎస్ అధికారులు వారధిగా పనిచేయాలన్నారు. కేసుల విచారణ సమయంలో నిందితులపై నేరారోపణలు రుజువు చేసేందుకు సాక్షులు సకాలంలో హాజరయ్యేందుకు సమన్లను సకాలంలో అమలుచేయాలని, కోర్టులు జారీచేసిన నాన్‌బెయిల్‌బుల్ వారంట్లను ఎగ్జిక్యూట్ చేసి, నిందితులు కోర్టు వాయిదాలకు క్రమం తప్పకుండా హాజరయ్యేవిధంగా చూడాలని సూచించారు. మహిళలపై జరిగే దాడులు, పోక్సో, గంజాయి కేసుల్లో నిందితులు కఠినంగా శిక్షకు గురయ్యేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని స్పష్టం చేశారు. కేసుల విచారణ వివరాలను ఎప్పటికప్పుడు సీసీటీఎన్‌ఎస్‌లో అప్‌లోడ్ చేయాలని అధికారులను ఆదేశించారు. జూమ్ కాన్ఫరెన్స్‌లో అడిషనల్ ఎస్పీ పి.సౌమ్యలత, పలువురు డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, కోర్టు కానిస్టేబుళ్లు, కోర్టు మానిటరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.


