వేపాడ: మండలంలోని శింగరాయి గ్రామంలో గురువారం ఉదయం 10గంటల సమయంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఒక పూరిల్లు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో వనమోజు అప్పలనరసమ్మ నివాసం ఉంటున్న పూరిల్లు కాలిపోగా, ఇంట్లో ఉన్న వంట సరుకులు పాత్రలు, దుస్తులు రెండు ఫ్యాన్లు, విద్యుత్ మీటరు, దాచుకున్న 20,000 వేల నగదు అగ్నికి ఆహుతైనట్లు ఆమె చెప్పింది. గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు గ్రామ రెవెన్యూ అధికారి గనివాడ సోమరాజు దర్యాప్తు జరిపి ఆస్తి నష్టం రూ.20 వేల వరకు ఉంటుందని నివేదికను సమర్పించినట్లు మండల రెవెన్యూ అధికారిణి జె.రాములమ్మ తెలిపారు.
పూసపాటిరేగ : భోగాపురం మండలం రెడ్డికంచేరులో రెండు పూరిళ్లు దగ్ధ మయ్యాయి. గ్రామానికి చెందిన వనం అప్పయ్యమ్మ, ముడసల అచ్చియ్యమ్మలకు చెందిన గృహాలు కాలిపోయాయి. పూరిళ్ల ఉన్న గృహోప కరణాలు కొంత మేర దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన యువత వచ్చి కొంత మేర మంటలను అదుపుచేయడంతో ఆస్తి, ప్రాణనష్టం తప్పింది.
జేఎన్‌టీయూ జీవీలో ‘సాహిత్యం సామాజిక ప్రయోజనం’
విజయనగరం రూరల్: జిల్లా కేంద్రం శివారు జేఎన్‌టీయూ–జీవీలో ‘సాహిత్యం–సామాజిక ప్రయోజనం’ అంశంపై ప్రత్యేక సాహిత్య కార్యక్రమం గురువారం నిర్వహించారు. జేఎన్‌టీయూ జీవీ, కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాలలోని ప్రాథమిక శాస్త్రాలు–హ్యుమానిటీస్ విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జేఎన్‌టీయూ – జీవీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ప్రిన్సిపాల్ డాక్టర్ వీఎస్.వకుళ మాట్లాడుతూ విద్యార్థులు సాహిత్యాన్ని కేవలం పఠనానికే పరిమితం చేయకుండా, సమాజాన్ని అర్థం చేసుకోవడానికి, మానవీయ విలువలను పెంపొందించుకోవడానికి ఒక సాధనంగా భావించాలని సూచించారు. తెలుగు సాహితీ సమితికి చెందిన సాహితీవేత్తలు, కవులు చీకటి దివాకర్, డాక్టర్ జీవీఎస్. జయపాలరావు, రత్నాల బాలకృష్ణ, వి.వెంకటరావు, పప్పు భోగారావులు మాట్లాడుతూ సాహిత్యం వ్యక్తిలో ఆలోచనా శక్తిని, సృజనాత్మకతను, సామాజిక బాధ్యతను పెంపొందిస్తుందన్నారు. సమాజంలోని సమస్యలను ప్రతిబింబిస్తూ సానుకూల మార్పునకు మార్గదర్శకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా యువతలో పఠనాశక్తిని పెంపొందించడం, మాతృభాషపై అభిమానం పెంచడం, సాహిత్యాన్ని సామాజిక చైతన్యానికి అనుసంధానం చేయడం అవసరమని అన్నారు. అనంతరం వచ్చేనెల 10 నుంచి విశాఖలో జరగనున్న సాహిత సమ్మేళనం –2026 కార్యక్రమం గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల సీఎస్‌ఈ విభాగానికి చెందిన అధ్యాపకులు డిడివి. ఆర్.శివరాం, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
స్కూల్ గేమ్స్ కార్యదర్శులుగా వాణిశ్రీ, శ్రీను
విజయనగరం: విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్కూల్ గేమ్స్ కార్యదర్శులుగా ఎంఆర్ సంస్కృత హైస్కూల్ స్కూల్ అసిస్టెంట్ పీడీ రావాడ వాణిశ్రీ, జామి మండలం భీమసింగి జెడ్పీహెచ్‌ఎస్ పీఈటీ బైరెడ్డి శ్రీనులు ఎంపికయ్యారు. అండర్ 14, 17, 19 అడ్మిన్‌గా వీరు వ్యవహరించనున్నారు. ఈ మేరకు గురువారం జిల్లా విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది. స్కూల్‌గేమ్స్ ఆధ్వర్యంలో క్రీడల నిర్వహణ బాధ్యతలు చేపట్టనున్నారు.


