విజయనగరం గంటస్తంభం: కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో నిర్వహిస్తున్న కౌశల్యం ఉద్యోగ మేళాకు నిరుద్యోగ యువత నుంచి విశేష స్పందన లభించింది. గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు నిర్వహిస్తున్న ఈ మేళాలో మొత్తం 700 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. తొలిరోజు గురువారం మధ్యాహ్ననికి 136 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు అధికారి ఎం. కిరణ్‌కుమార్ మాట్లాడుతూ, అర్హత కలిగిన యువత ఉద్యోగ మేళాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లమో, బీటెక్ విద్యార్హతలు కలిగిన 18–32 ఏళ్ల పురుష అభ్యర్థులు అర్హులని తెలిపారు. ఎంపికై న వారికి నెలకు రూ.15,500 నుంచి రూ.16,500 వరకు వేతనంతో పాటు వసతి, భోజనం, రవాణా సౌకర్యాలు కల్పిస్తారని పేర్కొన్నారు. ఉద్యోగ మేళా శుక్రవారం కూడా కొనసాగుతుందని తెలిపారు.


