కళ్లముందే కష్టమంతా బూడిద | - | Sakshi
Sakshi News home page

కళ్లముందే కష్టమంతా బూడిద

Sep 18 2026 12:57 AM | Updated on Sep 18 2026 12:57 AM

షార్ట్‌ సర్క్యూట్‌తో షాప్‌ దగ్ధం

దాదాపు రూ.1.20 కోట్ల నష్టం

డీజిల్‌ ఇంజిన్‌తో మంటలు అదుపు చేసిన గ్రామస్తులు

సంతకవిటి: విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం జరిగి కోట్లలో నష్టం వాటిల్లింది. సంతకవిటి మండలంలో గురువారం జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని మద్దూరు రామయ్య అగ్రహారంలో సుగంధం చందు అనే వ్యక్తి ఎస్‌సీఎస్‌ఆర్‌ ఫర్నిచర్‌, ఎలక్రానిక్స్‌, హోమ్‌ అప్లయెన్సెస్‌, బీరువాలు మాన్యుఫ్యాక్చరింగ్‌ షాప్‌ నడుపుతున్నారు. గురువారం ఉదయం 8 గంటల ప్రాంతంలో విద్యుత్‌ మీటర్‌ వద్ద షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు గమనించి విషయం తెలియజేయడంతో కుటుంబసభ్యులు వచ్చి షట్టర్లు తెరిచి మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నించి అందులో ఉన్న ఒక దివాన్‌కాట్‌ను బయటకు తీశారు. మిగతా వస్తువులు తీద్దామనుకునే లోపే మంటలు షాప్‌ మొత్తం వ్యాపించాయి. కనీసం దగ్గరకు కూడా వెళ్లలేనంతగా మంటలు వ్యాపించాయి. షాపులో ఉన్న ఏసీలు, టీవీలు, మంచాలు, పరుపులు, ప్లాస్టిక్‌ కుర్చీలు, కుక్కర్‌లు, ఇన్వర్టర్‌లు, కంప్యూటర్‌, వాషింగ్‌ మెషీన్‌లు, కూలర్‌లు అన్నింటికీ మంటలు వ్యాపించాయి. ఇంతలో గ్రామస్తులు తేరుకుని డీజిల్‌ ఇంజిన్‌ ఏర్పాటు చేసి షాప్‌లోకి పైపుల సహాయంతో నీటిని తీసుకు వచ్చి మంటలను అదుపు చేశారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇంతలో రాజాంలో నివసిస్తున్న యజమాని చందు వచ్చి పరిస్థితి చూసి సొమ్మసిల్లి పడిపోయాడు.

సమయానికి రాని ఫైర్‌ ఇంజిన్‌

మండలంలోని చాలా గ్రామాలు పొందూరు ఫైర్‌ స్టేషన్‌ పరిధిలో ఉన్నాయి. ప్రమాదం జరిగిన మద్దూరు రామయ్య అగ్రహారం కూడా పొందూరు ఫైర్‌ స్టేషన్‌ పరిధిలోనిదే. రోడ్డు బాగోలేదనే కారణంతో గ్రామానికి రాలేమని ఫైర్‌ సిబ్బంది చెప్పినట్లు గ్రామస్తులు తెలిపారు. అనంతరం రాజాం నుంచి ఫైర్‌ ఇంజిన్‌ రాగా ఇప్పుడెందుకు వచ్చారని గ్రామ మహిళలు ప్రశ్నించారు. ఇప్పుడు వచ్చి ఏం లాభమని నిలదీశారు. ఫైర్‌ సిబ్బంది మంటలను పూర్తి స్థాయిలో అదుపు చేశారు. దాదాపు రూ 1.20 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఫైర్‌ ఆఫీసర్‌ వై.గోవిందరావు తెలిపారు.

25 లక్షల యూవీ ప్రింటింగ్‌ మెషీన్‌ అగ్గిపాలు

15 రోజుల క్రితం బీరువాలపై ప్రింటింగ్‌ వేసేందుకు రూ.25 లక్షలు ఖర్చు చేసి యూవీ ప్రింటింగ్‌ మెషీన్‌ను బెంగళూరు నుంచి యజమాని చందు తీసుకు వచ్చారు. కనీసం గంట ముందు ఫైర్‌ ఇంజిన్‌ వచ్చినా ఈ మెషీన్‌ అయినా మిగిలి ఉండేదని యజమాని భోరున విలపించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement