వండాన పేటలో
రేగిడి: మండల పరిధిలోని వండానపేట గ్రామంలో సోమవారం రాత్రి వైఎస్సార్ సీపీ శ్రేణులపై పచ్చమూకలు రెచ్చిపోయాయి. వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై విరుచుకుపడ్డాయి. రాత్రి నిద్రపోయే వేళ ఇంటికి వెళ్లి దాడిచేయడంతో బాధితులు పరుగులు తీశారు. విడిచిపెట్టాలంటూ ప్రాథేయపడినా విడిచిపెట్టలేదు. టీడీపీ కార్యకర్తల దాడిలో తీవ్ర గాయాలైన వియ్యపు జనార్దనరావు, వియ్యపు సూర్యనారాయణ, వియ్యపు వెంకటరమణ, వియ్యపు వెంకటలక్ష్మిను వారి కుటుంబ సభ్యులు 108లో రాజాం సామాజిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. ఇరువర్గాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదుచేశామని ఎస్‌ఐ వి.బాలకృష్ణ తెలిపారు. ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, రాజాం నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ తలే రాజేష్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న బాధితులను మంగళవారం పరామర్శించారు. ఘటన వివరాలను మాజీ సర్పంచ్ వియ్యపు చక్రపాణిని అడిగితెలుసుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాజాం నియోజకవర్గంలో దాడులు అధికమయ్యాయన్నారు. చేతిలో అధికారం ఉందనే అహంకారంతో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోతున్నారన్నారు. పరామర్శించిన వారిలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు టంకాల అచ్చెన్నాయుడు, పార్టీ మండల కన్వీనర్ వావిలపల్లి జగన్మోహనరావు, రాజాం టౌన్ పార్టీ కన్వీనర్ పాలవలస శ్రీనివాసరావు, పార్టీ వంగర మండలాధ్యక్షుడు కరణం సుదర్శనరావు, రాజాం నియోజకవర్గ బీసీ సెల్ విభాగం అధ్యక్షుడు కరణం శ్రీనివాసరావు, యువజన విభాగం అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు, జిల్లా యువజన విభాగం కార్యదర్శి కెంబూరు నారాయణరావు, మున్సిపల్ విభాగం అధ్యక్షుడు శాసపు వేణుగోపాలనాయుడు, సలాది సతీష్, దూబ గోపాలం, కోరాడ రామినాయుడు తదితరులు ఉన్నారు.
వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి
పలువురికి గాయాలు
ఆస్పత్రికి తరలింపు
బాధితులను పరామర్శించిన
ఎమ్మెల్సీ విక్రాంత్, ఇన్‌చార్జి
తలే రాజేష్


