రక్తదానం చేసిన మహిళ | - | Sakshi
Sakshi News home page

రక్తదానం చేసిన మహిళ

May 13 2026 2:14 AM | Updated on May 13 2026 2:14 AM

విజయనగరం ఫోర్ట్‌: ఆపదలో ఉన్న ఓ మహిళకు మరో మహిళ రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచింది. జామి మండలం జాగారం గ్రామానికి చెందిన అల్లు వెంకటలక్ష్మి శస్త్రచికిత్స నిమత్తం ఘోషాఆస్పత్రిలో చేరింది. ఆమెకు శస్త్రచికిత్స నిమిత్తం ‘ఒ పాజిటివ్‌’ రక్తం ఎక్కించాలని వైద్యులు సూచించడంతో వారి బంధువులు ఆశ్రయ బ్లడ్‌ డోనర్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు బి. రామకృష్ణారావును ఆశ్రయించారు. ఆయన సూచన మేరకు క్లబ్‌ సభ్యురాలు సాయి ఝాన్సీ మంగళవారం ప్రభుత్వ రక్తనిధి కేంద్రానికి వచ్చి రక్తదానం చేశారు. సకాలంలో స్పందించి రక్తదానం చేసినందుకు గాను ఝాన్సీని రామకృష్ణారావు, రోగి బంధువు చిన్ననాయుడు సత్కరించారు.

సెమీ కండక్టర్‌ ఫ్యాబ్రికేషన్‌, క్యారెక్టరైజేషన్‌పై శిక్షణ

సీతంపేట: గిరిజన విద్యార్థులు సెమీ కండక్టర్‌ ఫ్యాబ్రికేషన్‌, క్యారెక్టరైజేషన్‌పై శిక్షణలో చేరేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని పాలకొండ సబ్‌ కలెక్టర్‌, ఐటీడీఏ ఇన్‌చార్జ్‌ పీఓ పవార్‌ స్వప్నిల్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. భారత ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో శిక్షణ ఉంటుందన్నారు. నాల్గవ సంవత్సరం చదువుతున్న బీఎస్‌సీ విద్యార్థులు, ఎంఎస్‌సీ మొదటి సంవత్సరం చదువుతున్న వారు అర్హులన్నారు. వివరాలకు వెబ్‌సైట్‌ చూడాలని సూచించారు.

ప్రెజర్‌ కుక్కర్‌ పేలి మహిళకు తీవ్రగాయాలు

గజపతినగరం: మండల కేంద్రంలోని కుమ్మర వీధిలో వంట చేస్తుండగా లక్ష్మి అనే మహిళ తీవ్రగాయాల పాలైంది. మంగళవారం జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. లక్ష్మి అనే మహిళ తన ఇంటి వద్ద గ్యాస్‌ పై ప్రెజర్‌ కుక్కర్‌లో వంట చేస్తుండగా ఒక్క సారిగా ప్రెజర్‌ కుక్కర్‌ పేలడంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. తక్షణమే ఆమెను బంధువులు గజపతినగరం ప్రాంతీయ ఆస్పత్రికి ఆటోలో తరలించి వైద్యసేవలు అందిస్తున్నారు.

మాజీ సైనికుడికి

10రోజులు జైలుశిక్ష

రూ.10,000 జరిమానా

విజయనగరం క్రైమ్‌/లక్కవరపుకోట: ఒక మాజీ సైనికుడు మందు తాగి డ్రంకెన్‌ డ్రైవ్‌లో చిక్కినందుకుగాను కొత్తవలస జ్యుడిషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ విజయచందర్‌ పది రోజులు జైలు శిక్ష, రూ.పదివేలు జరీమానా విధిస్తూ తీర్పు ఇచ్చారని ఎస్పీ దామోదర్‌ మంగళవారం తెలిపారు. ఎల్‌.కోట ఎస్సై రామకృష్ణ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది మే 11న ఎల్‌.కోట పోలీస్‌ స్టేసన్‌ పరిధిలో గోల్డ్‌ స్టార్‌ జంక్షన్‌ వద్ద డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు చేపట్టగా జమ్మాదేవి పేట గ్రామానికి చెందిన మాజీ సైనికుడు కూరిమిని శ్రీనివాసరావు మద్యం తాగి మోటారు సైకిల్‌ నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో మాజీ సైనికుడిపై పోలీసులు కేసు నమోదు చేసి మే 12న కొత్తవలస జ్యుడిషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ వద్ద హాజరుపరచగా జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు.

గుర్తు తెలియని మహిళ

మృతదేహం లభ్యం

విజయనగరం క్రైమ్‌: విజయనగరం వన్‌ టౌన్‌ పోలీసులు మంగళవారం గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని కనుగొన్నారు. ఆర్టీఓ ఆఫీస్‌కు వెళ్లే దారిలో సీతం కాలేజీవద్ద 55 ఏళ్ల వయస్సు కలిగిన మహిళ మృతదేహాన్ని కనుగొన్నట్లు ఏఎస్సై జగన్మోహన్‌ రావు తెలిపారు. మృతురాలిని గుర్తించగలిగిన వారు వన్‌ టౌన్‌ స్టేషన్‌ లేదా కంట్రోల్‌ రూమ్‌ కు సమాచారం తెలపాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement