దళిత క్రైస్తవులకు న్యాయం
● కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం
విజయనగరం టౌన్: దళిత క్రైస్తవులకు న్యాయం చేకూరేవరకూ ఉద్యమిస్తామని కేంద్ర మాజీమంత్రి జేడీ శీలం పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక సిమ్స్ బాప్టిస్ట్ చర్చి ఆవరణలో రాజ్యాంగం, మతస్వేచ్ఛ, దళిత క్రైస్తవుల తక్షణ కర్తవ్యం అనే అంశంపై మంగళవారం జరిగిన దళిత క్రైస్తవ మహాసభలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని ప్రసంగించారు. తాము అండగా ఉన్నామని భరోసా కల్పించారు. క్రిస్టియన్, మైనారిటీ వర్గాలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్ వర్తింపజేయాలన్న రాష్ట్రాల తీర్మానాన్ని ఆమోదించి, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా రిజర్వేషన్ హక్కులు కల్పించాలని కోరారు. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జి.విజయకుమార్ (ఐఏఎస్) మాట్లాడుతూ ప్రస్తుతం వివక్ష కొనసాగుతోందన్నారు. మానవ మనుగడకు ఆటంకం ఏర్పడిందని సమానత్వం హక్కు ఎస్సీ క్రిస్టియన్స్‌కు, ముస్లింలకు మనం ఎన్నుకున్న ప్రభుత్వాలు అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. రాజ్యాంగానికి విరుద్ధంగా మతప్రాతిపదికన రిజర్వేషన్‌లు ఇస్తామనడం ఎంతవరకూ సబబని ప్రశ్నించారు. అంబేడ్కర్ ఇండియా మిషన్ అధ్యక్షుడు పీవీ.సునీల్ కుమార్ (ఐపీఎస్) మాట్లాడుతూ అంబేడ్కర్ ఆశయసాధనలో దళితులకు సమస్యలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని కోరారు. ప్రభుత్వం సరైన రీతిలో స్పందించి రిజర్వేషన్‌ల విషయంలో న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ అధ్యక్షుడు రంజిత్ ఒఫిర్, వైఎంసీఏ అధ్యక్షుడు రోలెండ్ విలియమ్స్‌లు ప్రసంగించారు. సంఘమిత్ర ఆర్‌ఎస్.జాన్ అధ్యక్ష్యతన నిర్వహించిన దళిత మహాసభలో సిమ్స్ చర్చి అధ్యక్షుడు తాలాడ ఆనంద్, పాస్టర్ వై.ప్రభాకర్ ఆంద్రప్రదేశ్ దళిత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఆదాడ మోహనరావు, జమాతే ఇస్లాం కమిటీ ప్రతినిధి హబీబ్, రిటైర్ట్ పీటీసీ ప్రిన్సిపల్ డాక్టర్ కె.రాజశిఖామణి, ఉత్తరాంధ్ర జిల్లాల సంఘ ప్రతినిధులు, అధిక సంఖ్యలో దళిత సంఘాల నాయకులు, పాల్గొన్నారు.


