రాజాం: పట్టణంలోని మెంతిపేటలో గల ప్రభుత్వ జవహర్ బాలభవన్ వేసవి శిక్షణ తరగతులను జీ తెలుగు టీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎపిసోడ్స్ డైరెక్టర్ శేఖర్ మంగళవారం సందర్శించారు. జీ తెలుగులో పలు కార్యక్రమాలకు దర్శకత్వం వహిస్తున్న ఆయన బాలభవన్‌లో వేసవి శిక్షణ తరగతుల్లో భాగంగా నేర్పిస్తున్న పలు కార్యక్రమాలపై ఆరాతీయడంతో పాటు వాటిని పరిశీలించి, చిన్నారులతో ముచ్చటించారు. విద్యార్థులు చదువుతో పాటు పలు రంగాల్లో రాణించాలని, ఇవి ఉపాధినే కాకుండా మానసిక, శారీరక వికాసానికి తోడ్పడతాయని వెల్లడించారు. సంగీతం, నృత్యం వంటి కళల్లో విద్యార్థులు మంచి ప్రతిభ కనభరిచి రాష్ట్రస్థాయిలో రాణించాలని కోరారు. కళాకారులుగా గుర్తింపు పొంది, జిల్లాకు, రాష్ట్రానికి పేరుతేవాలన్నారు. ఈ సమయంలో నేర్చుకున్న కళలు జీవితంలో ఏదోఒక సమయంలో ఉపయోగపడ్తాయని గుర్తుచేశారు. మంచి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, వేసవి చిన్నారులకు మంచి మానసిక ఆటవిడుపుగా ఉంటుందని వివరించారు. కార్యక్రమంలో బాలభవన్ డైరెక్టర్ డాక్టర్ సుంకరి రమేష్, డ్యాన్స్ మాస్టర్ తారకేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


