● ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి
పార్వతీపురం రూరల్: జిల్లాలో నమోదైన గంజాయి (ఎన్డీపీఎస్) కేసుల దర్యాప్తు పురోగతిపై ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి దర్యాప్తు అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ఆయన..పెండింగ్‌లో ఉన్న కేసులపై కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వారి ఆచూకీ కనిపెట్టాలని ఎస్పీ సూచించారు. గంజాయి అక్రమ రవాణా ద్వారా సంపాదించిన ఆస్తులను గుర్తించి జప్తు చేయాలని, పదేపదే నేరాలకు పాల్పడే వారిపై ’పిట్ ఎన్డీపీఎస్’ చట్టం కింద చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సీజ్ చేసిన గంజాయి, వాహనాలకు సంబంధించి న్యాయస్థానాల సమక్షంలో త్వరితగతిన ఇన్వెంటరీ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదికలు త్వరగా తెప్పించుకుని, నిర్ణీత గడువులోగా కోర్టుల్లో చార్జిషీట్లు దాఖలు చేయాలని అధికారులను ఆదేశించారు. మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ’సంకల్పం 2.0, చైతన్యం 2.0, అభ్యుదయం 2.0’ పేరిట రూపొందించిన 100 రోజుల ప్రత్యేక ప్రణాళికను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. గంజాయి వినియోగదారులను గుర్తించి వారికి కౌన్సెలింగ్ ఇవ్వడం ద్వారా సరఫరా మూలాలను ఛేదించాలని సూచించారు. ఈ సమావేశంలో ఏఎస్పీ మనీషా రెడ్డి, పాలకొండ డీఎస్పీ రాంబాబు, సీఐలు పాల్గొన్నారు.


