● పీటీసీలో ట్రైనీ ఎస్సైలకు ఎస్పీ సూచన
విజయనగరం క్రైమ్: సాంకేతికతను అందిపుచ్చుకుని సమర్థవంతమైన సేవలందించాలని ఎస్పీ దామోదర్ మంగళవారం అన్నారు. ఈ మేరకు స్థానిక పీటీసీలో ప్రీ ప్రమోషనల్ ఎస్సై ట్రైనింగ్ పొందుతున్న 49 మంది ఏఎస్సైల నుద్దేశించి ఎస్పీ మాట్లాడారు. పోలీసు శాఖలో ఎస్సైలుగా ఉద్యోగోన్నతి పొందేందుకు ఆరు వారాల శిక్షణ నిమిత్తం విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం జిల్లాల నుంచి పోలీసు శిక్షణ కళాశాలకు విచ్చేసిన 49 మంది ఎస్సై శిక్షణార్థులతో ఎస్పీ ఏఆర్.దామోదర్ మమేకమై, భవిష్యత్తులో ఎస్సైలుగా నిర్వహించాల్సిన విధులపట్ల దిశానిర్దేశం చేశారు. పీటీసీ వైస్ ప్రిన్సిపాల్ పి.వి.అప్పారావు ఎస్పీకి పూల మొక్కను అందజేసి, స్వాగతం పలకగా, పోలీసుల నుంచి ఎస్పీ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ పోలీసుశాఖలో సుమారు 35 సం.లు పైబడి సర్వీసు పూర్తి చేసుకుని, నేడు ఎస్సైలుగా ఉద్యోగోన్నతి పొందేందుకు శిక్షణకు వచ్చిన వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, పీటీసీ వైస్ ప్రిన్సిపాల్ పి.వి.అప్పారావు, డీఎస్సీ వాసుదేవ్, పలువురు సీఐలు, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు, ఎస్సై, ట్రైనీ ఏఎస్సైలు పాల్గొన్నారు.


