గార: మండలంలోని వత్సవలస రాజమ్మ తల్లి జాతరకు వెళ్తూ ఆర్టీసీ బస్ చక్రాలు కిందపడి మహిళ మృతి చెందింది. జి.సిగడాం మండలం ఎస్‌పీ రామచంద్రాపురం (అగ్రహారం)కు చెందిన ముగుడ కనక (50) కుమారుడు కవిలేశు స్కూటీపై ఆదివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో శ్రీకూర్మం మీదుగా వత్సవలస వెళ్తున్నారు. తండ్యాలపేట గ్రామ సమీపంలోకి వచ్చేసరికి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్ స్కూటీకి తగిలింది. దీంతో డ్రైవింగ్ చేస్తున్న కవిలేశు పక్కకు పడిపోగా, తల్లి కనక రోడ్డుపై పడిపోవడంతో తలపై నుంచి ఆర్టీసీ వెనుక చక్రం వెళ్లిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలు కనక భర్త గుజరాత్ రాష్ట్రంలోని ఒక ప్రైవేటు పరిశ్రమలో పనిచేస్తున్నాడు. కవిలేశు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్‌ఐ తెలుగు చంద్రమోహన్ తెలిపారు.


