రెండేళ్ల పాలనలో ఏం చేశారు..? | - | Sakshi
Sakshi News home page

రెండేళ్ల పాలనలో ఏం చేశారు..?

Mar 30 2026 7:21 AM | Updated on Mar 30 2026 7:21 AM

రెండేళ్ల పాలనలో ఏం చేశారు..?

ఏడాదిలో 70 శాతం పోర్టు పనులు పూర్తి చేసిన ఘనత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానిదే

పోర్టు నిర్మాణంలో వాస్తవాలను ప్రజలకు వివరించడానికే ‘పోర్టుకు పోదాం పదండి’ కార్యక్రమం

నౌపడ సమీపంలో సభా స్థలం పరిశీలించిన వైఎస్సార్‌సీపీ నాయకులు

నేడే పోర్టుకు పోదాం పదండి భారీ బహిరంగ సభ

టెక్కలి, సంతబొమ్మాళి: వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాకు ప్రపంచ పటంలో ప్రత్యేక గుర్తింపునిచ్చే విధంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో గత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మూలపేట పోర్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారని వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర రీజనల్‌ కోఆర్డినేటర్‌ బూడి ముత్యాలనాయుడు, జిల్లా పరిశీలకుడు ఎమ్మెల్సీ కుంభా రవిబాబు అన్నారు. సోమవారం సంతబొమ్మాళి మండలం నౌపడ సమీపంలో నిర్వహిస్తున్న ‘పోర్టుకు పోదాం పదండి’ భారీ బహిరంగ సభ స్థలాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాసు, నియోజకవర్గ ఇన్‌చార్జి పేరాడ తిలక్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ.. గతంలో ఎంతో మంది నాయకులు ఈ ప్రాంతంలో పోర్టు కడతామని హామీలిచ్చి మరచిపోయారని గుర్తు చేశారు. ఈ జిల్లాను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో వైఎస్సార్‌సీపీ హయాంలో గత సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మూలపేట పోర్టుకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. సుమారు రూ.4362 కోట్లతో అన్ని రకాల అనుమతులతో పోర్టు నిర్మాణాన్ని ప్రారంభించారని, ఎన్నికల సమయానికి 70 శాతం పనులు పూర్తి చేశారని పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో మాయ మాటలతో కూటమి ప్రభుత్వం అధికారం దక్కించుకుని మిగిలిన 30 శాతం పనులు పూర్తి చేయలేదని ముత్యాలనాయుడు ఆరోపించారు. పోర్టు నిర్మాణంలో వాస్తవ పరిస్థితులను తెలియజేయడానికే పోర్టుకు పోదాం పదండి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

అనంతరం జిల్లా పరిశీలకుడు, ఎమ్మెల్సీ కుంభా రవిబాబు మాట్లాడుతూ.. టెక్కలి నియోజకవర్గం ప్రాంతంలో పోర్టు నిర్మాణం 70 ఏళ్లుగా కలగా మిగిలిపోయిందన్నారు. అలాంటి కలను సాకారం చేసే విధంగా గత సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మూలపేట పోర్టుకు రూపకల్పన చేశారని గుర్తు చేశారు. అబద్ధపు హామీలతో అధికారం దక్కించుకున్న కూటమి నాయకులు రెండేళ్లు కాలయాపన చేశారని మండిపడ్డారు. 30 శాతం పనులు పూర్తి చేయలేకపోవడమే కాకుండా పోర్టు క్రెడిట్‌ను దోచుకునే ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. మూలపేట పోర్టు మంజూరు కోసం జిల్లాకు చెందిన ధర్మాన ప్రసాదరావు, కృష్ణదాసు ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. మూలపేట పోర్టుకు పోదాం పదండి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయం చేయాలని కోరారు.

అనంతరం వైఎస్సార్‌సీపీ యువ నాయకుడు ధర్మాన కృష్ణచైతన్య మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ హయాంలో ఏడాది కాలంలో 70 శాతం పోర్టు పనులు పూర్తి చేశారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టెక్కలి నియోజకవర్గం టీడీపీ ముఖ్య నాయకులతో పాటు నారా లోకేష్‌ వరకు కమీషన్‌ల కోసం కక్కుర్తి పడడంతో పనులు నిలిచిపోయాయని ఆరోపించారు. జిల్లాలో వలసల నివారణ, యువతకు ఉపాధి, జిల్లా అభివృద్ధి కోసం నిర్మాణం తలపెట్టిన పోర్టు పనులు పూర్తి చేసేందుకు నిర్వహిస్తున్న పోర్టుకు పోదాం పదండి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. వీరితో పాటు జెడ్పీటీసీ పాల వసంత్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు బి.మోహన్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు అన్నెపు రామారావు, నాయకులు పి.రవికుమార్‌రెడ్డి, ఎన్‌.భీమారావు, ఎస్‌.సత్యం, కె.సతీష్‌, జి.గురునాధ్‌యాదవ్‌, కె.అజయ్‌, ఎ.మురళి, కె.జీవన్‌, బి.రాజేష్‌, వి.శ్రీధర్‌రెడ్డి, బి.కార్తీక్‌, ఆర్‌.మురళీరెడ్డి తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement