● తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ● వ్యవసాయ పరిశోధనాస్థానం శాస్త్రవేత్త వెంకటరావు
సీతంపేట: ప్రస్తుత రబీ సీజన్‌లో ఎక్కువగా సాగవుతున్న పంటల్లో పొద్దుతిరుగుడు ఒకటి. ఈ సాగులో యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక లాభాలు పొందవచ్చని స్థానిక వ్యవసాయ పరిశోధనాస్థానం శాస్త్రవేత్త పి. వెంకటరావు తెలిపారు. ఈ నేపథ్యంలో సాగులో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులపై ఆయన వెల్లడించిన వివరాలు.. సాగు మొదటిలోనే ఆకులు తినే పురుగులు గుంపులుగా చేరి పత్రహరితాన్ని గీకి తింటాయి. దీనివల్ల ఆకులు జల్లెడాకులుగా మారుతాయి. వీటి నివారణకు విషపు ఎరను (పది కిలోల తవుడు, కిలో బెల్లం, ఒక లీటరు మోనోక్రోటోఫాస్ లేదా ఒక కిలో కార్బరిల్ 50 శాతం పొడి మందును తగు నీటితో కలిపి ఉండలుగా తయారు చేసుకుని) మొక్కల మొదళ్ల దగ్గర సాయంత్రం సమయంలో వేసుకోవాలి. లేదా 0.5 ఎం.ఎల్ స్పైనోసాడ్‌ను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి.
బీహారి గొంగళి పురుగు..
తల్లి పురుగు ఆకులపై గుడ్లను గుంపులుగా పెడుతుంది. లార్వాల శరీరం లేత పసుపు రంగుతో ఉండి ముదురు పసుపు రంగు వెంట్రుకలతో కప్పబడి ఉంటుంది. ఈ లార్వాలు ఆకుల్ని తిని తీవ్రనష్టాన్ని కలిగిస్తాయి. పురుగుల ఉధృతంగా ఆశిస్తే మొక్కలు మోడుబారుతాయి. గుడ్లు, తొలిదశ గొంగలి పురుగులు గుంపులుగా ఆకుల మీద ఉన్నపుడు ఏరి పారేయాలి. అలాగే వేప గింజల ద్రావణాన్ని (5 శాతం) పిచికారీ చేయాలి. పెద్ద లార్వాలు ఉన్న ఏడల ఎండోసల్ఫాన్ లేదా క్లోరిఫైరిపాస్ 2 మి.లీ లేదా డైక్లోరావాస్ ఒక ఎం.ఎల్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
శనగపచ్చ పరుగు..
పొద్దు తిరుగుడు పండించే అన్ని ప్రాంతాల్లో ఈ పురుగు ఆశిస్తుంది. లార్వాలు పువ్వులు, గింజల మధ్య చేరి వాటిని తింటూ అధిక నష్టాన్ని కలుగజేస్తాయి. వీటి నివారణకు ఎండోసల్ఫాన్ లేదా క్వినాల్ పాస్, క్లోరిపైరిపాస్ 2 మి.లీ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
రసం పీల్చే పురుగులు..
దీపపు పరుగులు ఆశించిన ఆకుల చివర్లు పసుపు పచ్చగా మారి క్రమేపీ ఆకంతా ఎర్రబడి ముడుచుకుని దోనెల్లాగా కనిపిస్తాయి. వీటి నివారణకు మోనోక్రోటోపాస్ 1.6 మి.లీ. లేదా డైమిథోయేట్ లీటర్ నీటికి 2 మి.లీ కలిపి ఆకుల అడుగు భాగం తడిచేలా పిచికారీ చేయాలి. తెల్లదోమ ఆకుల అడుగుభాగం నుంచి రసాన్ని పీల్చడం వల్ల ఆకులు పసుపు రంగుకు మారి మొక్కలు కూడా గిడసబారి ఎండిపోతాయి. వీటి నివారణకు ట్రైజోఫాస్ 2.5 మి.లీ లేదా ఎసిఫేట్ ఒక గ్రాము లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. తామర పురుగులు ఈ పంటను మొదటి దశ నుంచీ నాశనం చేస్తాయి. వాతావరణంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు, పైరు బెట్టకు గురైనపుడు వీటి ఉధృతి ఎక్కువగా ఉంటుంది. వీటి నివారణకు మోనోక్రోటాపాస్ 1.6 మి.లీ. లీటర్ నీటిలో కలపి పిచికారీ చేయాలి. పిండినల్లి గుడ్లు ఆకులు, మొగ్గ కింద భాగాన చేరి రసాన్ని పీలుస్తాయి. తద్వారా మొక్క పసుపు వర్ణంలోకి మారి ఎక్కువగా ఆశించినట్టయితే చనిపోతుంది. దీని నివారణకు గాను పంటలో కలుపు మొక్కలు ముఖ్యంగా వయ్యారిభామ లేకుండా చూసుకోవాలి. అధికంగా ఆశించిన మొక్కను పీకి పారేయడం మంచిది. ఈ పురుగును నివారణకు ప్రొఫినోఫాస్ 50 శాతం ఈసీ 2 మి.లీను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి.
పక్షుల బెడద..
ఈ పంటకు ముఖ్యంగా రామచిలుకల బెడద ఎక్కువ. వీటి నివారణకు పైరును పెద్ద కమతాలలో వేయాలి. మెరుపు రిబ్బనులను పైరుపైన అడుగు ఎత్తున సూర్యరశ్మి రిబ్బనుపై పడేటట్టు ఉత్తర, దక్షిణ దిశగా కట్టాలి. అలాగే దిష్టిబొమ్మలు ఏర్పాటు చేయడం వల్ల కూడా పక్షుల బెడదను తగ్గించవచ్చు.
విత్తనోత్పత్తి..
పొద్దు తిరగుడులో హైబ్రిడ్ విత్తనోత్పత్తి చేపట్టుటకు రబీ కాలం అనువైనది. విత్తనోత్పత్తి చేపట్టేందుకు సుమారు వెయ్యి మీటర్ల వరకు ఎలాంటి పొద్దుతిరుగుడు పంటలేని నీటి సదుపాయం గల సారవంతమైన పొలాన్ని ఎన్నుకోవాలి.
హైబ్రిడ్ విత్తనోత్పత్తి చేసేటప్పుడు ఆడ, మగ వరుసలను 3:1 నిష్పత్తిలో నాటుకోవాలి. ఆడ మొక్కలలో పుప్పొడి వెదజల్లే మొక్కలను గుర్తించి తీసివేయాలి. పూత దశలో ఉదయం పూట మగ మొక్కల పువ్వుల నుంచి పుప్పొడిని మొత్తటి గుడ్డతో రుద్ది.. అదే గుడ్డను తర్వాత ఆడ మొక్కల పువ్వులపై రుద్దాలి. దీని ద్వారా ఫలదీకరణం చెంది ఎక్కువ గింజ కట్టడానికి అవకాశం ఉంది. పొలం దగ్గర తేనెటీగలు పెంచడం ద్వారా కూడా గింజ కట్టే శాతాన్ని పెంచవచ్చు. కోత సమయంలో ఆడ,మగ పువ్వులను వేరుచేయాలి. ఆడమొక్కల నుంచి వచ్చిన విత్తనం హైబ్రిడ్ విత్తనం.


