ఉత్తరాంధ్ర కాదు.. ఉత్తమమైన ఆంధ్ర | - | Sakshi
Sakshi News home page

ఉత్తరాంధ్ర కాదు.. ఉత్తమమైన ఆంధ్ర

Mar 30 2026 7:21 AM | Updated on Mar 30 2026 7:21 AM

ఉత్తరాంధ్ర కాదు.. ఉత్తమమైన ఆంధ్ర

వేడుకగా న.ర.సం. ఉత్తరాంధ్ర మహిళల సదస్సు

ప్రముఖులకు నవ్యాంధ్ర కీర్తి పురస్కారాలు

హాజరైన పద్మభూషణ్‌ యార్లగడ్డ

విజయనగరం టౌన్‌: సాహితీ సౌరభాలకు నిలయమైన విజయనగరంలో అడుగు పెట్టడమే ఓ ఆనందం. ఇది ఉత్తరాంధ్ర కాదు.. ఉత్తమమైన ఆంధ్ర అంటూ పద్మభూషణ్‌ డాక్టర్‌ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ కొనియాడారు. నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం (న.ర.సం) ఉత్తరాంధ్ర మహిళల సదస్సు, జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్థానిక క్షత్రియ కల్యాణ మండపంలో ఆదివారం వేడుకగా నిర్వహించారు. విశిష్ట అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ సుమారు 80 మంది విద్యార్థినులు తమ కవితలను చదివి వాటిని కవన కూజితాలు రూపంలో అందించడమనేది చాలా విశేషమన్నారు. భావితరాలకు తెలుగు అందుతుందనే ఆనందాన్ని వ్యక్తం చేశారు. వ్యవహారిక భాషపై మహాకవి గురజాడ, గిడుగు చేసిన కృషిని శ్లాఘించారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌, ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి మాట్లాడుతూ న.ర.సం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న సాహిత్య కృషి ఎనలేనిదన్నారు. కార్యక్రమానికి ముందు నర్తనశాల అకాడమీ డాక్టర్‌ భేరి రాధికారాణి నేత్రత్వంలో విద్యార్థినులు నృత్య నీరాజనం సమర్పించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం అతిథులను ఘనంగా సత్కరించారు.

నవ్యాంధ్ర కీర్తి పురస్కారాలు

విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాలకు చెందిన ప్రముఖులకు నవ్యాంధ్ర కీర్తి పురస్కారాలను అందజేశారు. పురస్కారాలు పొందిన వారిలో విశాఖకు చెందిన డాక్టర్‌ చిలుకూరి శాంతమ్మ, డాక్టర్‌ కోలవెన్ను మలయవాసిని, డాక్టర్‌ దేవులపల్లి పద్మజ, డాక్టర్‌ అయ్యగారి సీతారత్నం, బాలబాట స్వరాజ్యం (రమణమ్మ), గిడుతూరి రామలక్ష్మి, విజయనగరానికి చెందిన పాకలపాటి రమణమ్మ, మహేంద్రవాడ లక్ష్మీరామదాసు, డాక్టర్‌ పెన్నేటి స్వప్న హైందవి, కెకె.భాగ్యశ్రీ,, కె.అనురాధ, వి.ఉషారమణి, శ్రీకాకుళానికి సంబంధించి డాక్టర్‌ పిలకా శాంతమ్మ, తులాల సవరమ్మ, పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించి గుడ్ల అమ్మాజీ, రావాడ కృష్ణకుమారి ఉన్నారు. వీరితో పాటూ విజయనగరం పుర ప్రముఖులను ఘనంగా సత్కరించారు. నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం గౌరవాధ్యక్షురాలు తేళ్ల అరుణ సభాధ్యక్ష్యతన నిర్వహించిన కార్యక్రమంలో ఆంధ్ర సారస్వత పరిషత్‌ అధ్యక్షుడు గజల్‌ శ్రీనివాస్‌, కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు గుత్తికొండ సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ జివి.పూర్ణచంద్‌, న.ర.సం వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్‌ చిన్న లక్ష్మీకళావతి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సింహాద్రి జ్యోతిర్మయి, గౌరవధ్యక్షురాలు తేళ్ల అరుణ, గౌరవ సలహాదారు డాక్టర్‌ నూనె అంకమ్మ రావు, జిల్లా అధ్యక్షురాలు చివుకుల శ్రీలక్ష్మి, ప్రధాన కార్యదర్శి భోగరాజు సూర్యలక్ష్మి, అధిక సంఖ్యలో కవులు, రచయితలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement