పార్వతీపురం: జిల్లాలో ఉపాధిహామీ, పంచాయతీరాజ్ శాఖల ద్వారా జరుగుతున్న రహదారి, అభివృద్ధి పనులకు సంబంధించి ఈనెల 25వ తేదీలోగా ఎంబుక్ రికార్డులు పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ ఎం. ప్రభాకరరెడ్డి సంబంధిత ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ నుంచి ఇంజినీరింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేవలం వాల్యూయేషన్ సర్టిఫికెట్‌తో బిల్లులు వస్తాయని భావించడం సరికాదని, ఆన్‌లైన్‌లో ఉన్న ఎంబుక్ రికార్డుల ప్రకారం బిల్లులు మంజూరు చేయడం జరుగుతుందనానరు. ఇంతవరకు జరిగిన ప్రతి పనికీ ఎంబుక్ రికార్డు చేసి, పాస్ ఆర్డర్ వేసి ఎంసీసీకి అందజేయాలన్నారు. సమావేశంలో జేసీ సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి, సబ్ కలెక్టర్లు ఆర్.వైశాలి, పవర్ స్వప్నిల్ జగన్నాథ్, డ్వామా పీడీ కె. రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
నిజాయితీకి చిరు సత్కారం
విజయనగరం క్రైమ్: నిజాయితీతో వ్యవహరించిన వ్యక్తిని పోలీసులు సత్కరించిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని విజయనగరం డిఫెన్స్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న సీతారామ్ అనే వ్యక్తికి స్థానిక గుమ్చీ వద్ద రెండు తులాల బంగారు బ్రేస్‌లెట్ ఆదివారం దొరికింది. దీంతో ఈ విషయాన్ని అకాడమీ డైరెక్టర్ డి. అనిల్‌కుమార్‌కు తెలియజేయగా.. ఆభరణాన్ని పోలీసులకు అందజేయాలని చెప్పడంతో వెంటనే సీతారామ్ ఆ బ్రేస్‌లెట్‌ను టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో అందజేశాడు. దీంతో సీఐ టి. శ్రీనివాసరావు విచారణ చేపట్టి బాధితుడు మస్తాన్‌కు బ్రేస్‌లెట్ అందజేశారు. అలాగే నిజాయితీగా వ్యవహరించిన సీతారామ్‌తో పాటు అనిల్‌కుమార్‌ను సత్కరించారు. కార్యక్రమంలో ఎస్సైలు ప్రమీల, కనకరాజు, క్రైమ్ పార్టీ సిబ్బంది వాసు, షఫీ, గణేష్ పాల్గొన్నారు.
ఘనంగా దొమ్మేటి జయంతి
విజయనగరం: ప్రముఖ సామాజిక సంస్కర్త, శెట్టిబలిజ సంఘ వ్యవస్థాపకుడు దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి సోమవారం స్థానిక కలెక్టరేట్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ ఎస్ సేతుమాధవన్, జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్ సత్తిబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దొమ్మేటి వెంకటరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. సమాజంలోని వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం, సామాజిక సమానత్వం కోసం వెంకటరెడ్డి చేసిన అలుపెరగని పోరాటం చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని, ప్రతిఒక్కరూ వెనుకబడినవర్గాల అభివృద్ధికి, సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. శెట్టిబలిజ సంఘ జిల్లా అధ్యక్షుడు చోడి ఆదినారాయణ మాట్లాడుతూ.. సమాజ సేవనే పరమావధిగా జీవించిన వెంకటరెడ్డి జీవన ప్రస్థానం నేటి యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమాధికారి జె. జ్యోతిశ్రీ, నాయీ బ్రాహ్మణ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు టీవీ దుర్గారావు, తూర్పుకాపు సంఘ నాయకుడు గండ్రేటి శ్రీను, వివిధ సంఘాల ప్రతినిధులు, జిల్లా అధికారులు, బీసీ సంక్షేమ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.


