సుప్రీం ఆదేశాలను పాటించండి | - | Sakshi
Sakshi News home page

సుప్రీం ఆదేశాలను పాటించండి

Mar 23 2026 7:02 AM | Updated on Mar 23 2026 7:02 AM

శృంగవరపుకోట:

కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని న్యాయమూర్తులు పని చేయాలని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి చీకటి మానవేంద్రనాథ్‌రాయ్‌ అన్నారు. ఎస్‌.కోటలో రూ.8.5 కోట్లతో నిర్మించనున్న సింగిల్‌ కోర్టు కాంప్లెక్స్‌ భవన శంకుస్థాపన కార్యక్రమానికి హైకోర్టు మరో న్యాయమూర్తి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్‌ జడ్జి తర్లాడ రాజశేఖరరావుతో కలిసి ఆదివారం హాజరయ్యారు. ముందుగా పాత కోర్టు భవన ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమానికి వచ్చిన న్యాయమూర్తులను జిల్లా అధికారులు, పలువురు న్యాయమూర్తులు ఆహ్వానించగా పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. రుత్వికులు మంత్రోచ్ఛారణతో పూర్ణకలశంతో స్వాగతించిన అనంతరం న్యాయమూర్తులు భవన నిర్మాణానికి భూమి పూజ చేసి, శంకుస్థాపన చేశారు. తరువాత శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం స్థానిక వెంకటేశ్వర ఫంక్షన్‌ హాల్‌లో ఎస్‌.కోట బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గోగాడ సూరిదేముడు నేతృత్వంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న జస్టిస్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌ మాట్లాడుతూ ఎస్‌.కోటలో కోర్టు భవనానికి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు. 1978లో ఆరంభమైన ప్రస్తుత కోర్టు భవనం సుమారు అర్ధ శతాబ్దం పాటు సేవలందించిందన్నారు. దేశ వ్యాప్తంగా నేటికీ బ్రిటీష్‌ కాలం నాటి భవనాల్లో కోర్టులు నడుస్తున్నాయన్నారు. ఏడేళ్ల కిందట అవసరమైన చోట ఆధునిక వసతులు, సౌకర్యాలతో కోర్టు భవనాలు నిర్మించాలని సుప్రీంకోర్టు ప్రభుత్వంతో చర్చించిదని, నాటి ప్రతిపాదనలు నేడు కార్యరూపం దాల్చాయని చెప్పారు. విజయనగరం, బొబ్బిలి, ఎస్‌.కోట కోర్టులకు బిల్లులు సమస్య రాకుండా చూస్తామన్నారు. తాము కోర్టులకు అవసరమైన సహకారం అందిస్తున్నామని చెప్పారు. కోర్టులు, సిబ్బంది, ఉద్యోగులు ఉన్నా ఎందుకు సకాలంలో తీర్పులు రావడం లేదో ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు మీడియేషన్‌పై దృష్టి పెట్టిందని, ట్రైన్డ్‌ మీడియేటర్ల ద్వారా కేసులు రాజీ చేసేందుకు అంతే వేగంగా ప్రయత్నాలు చేస్తున్నామని, మనకు అన్నీ ఇస్తున్న కోర్టుకు మనం ఏమిస్తున్నామో న్యాయవాదులు ఆలోచించాలన్నారు. తాను ఇక్కడి వాడినని.. అందుకే ఉత్తరాంధ్రపై మక్కువ అని, విజయనగరంపై మరింత అభిమానం సహజంగానే ఉంటుందన్నారు. 60 సెంట్లు స్థలంలో రూ.850 లక్షలతో ఎస్‌.కోట కోర్టు తయారవుతుందని, బార్‌ హాల్‌ కొలతలు పెంచాలని ఆదేశించామని చెప్పారు. హైకోర్టు మరో న్యాయమూర్తి టి.రాజశేఖరరావు మాట్లాడుతూ కేసులు క్లియర్‌ చేయాలన్న హడావుడిలో సరైన నిర్ణయాలు తీసుకోకుంటే మళ్లీ కేసులు కోర్టుల్లో పడే అవకాశం ఉందన్నారు. దీనికి సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జిల్లా న్యాయమూర్తి బి.బబిత మాట్లాడుతూ ఎస్‌.కోటలో 15 నెలల్లో మూడంతస్తుల కోర్టు భవనం అన్ని హంగులతో సిద్ధమవుతుందని, న్యాయవాదులు ఆశించిన ఫలితాలు సాధించాలని అన్నారు. గుంటూరు జిల్లా న్యాయమూర్తి సాయికళ్యాణ్‌ చక్రవర్తి మాట్లాడుతూ ఉన్నత స్థాయికి ఎదిగినా కొందరు వ్యక్తులే తాను పుట్టిన ఊరు, ప్రాంతం కోసం పని చేస్తారని, అటువంటి వారిలో మానవేంద్రనాథ్‌ రాయ్‌ ఒకరని కొనియాడారు. ఎస్‌.కోట బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు జి.సూరిదేముడు మాట్లాడుతూ తమ విజ్ఞాపనను మన్నించి శరవేగంగా కోర్టు భవనం నిర్మాణ అనుమతులు ఇప్పించి, నిధులు మంజూరు చేసిన న్యాయమూర్తి మానవేంద్రనాథ్‌రాయ్‌కు తామంతా రుణపడి ఉంటామన్నారు. అనంతరం జిల్లాలోని పలు బార్‌ అసోసియేషన్ల సభ్యులు హైకోర్టు న్యాయమూర్తులను సన్మానించి, జ్ఞాపికలు, పుష్పగుచ్ఛాలు అందజేశారు. న్యాయవాది డబ్ల్యూఎన్‌ శర్మ ముగింపు ఉపన్యాసంలో ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్‌ రాంసుందర్‌రెడ్డి, జిల్లా న్యాయమూర్తి ఎం.బబిత, ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌, మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి, డీఎస్పీ గోవిందరావు, ఎస్‌.కోట న్యాయమూర్తి బి.కనకలక్ష్మి, ఏజీపీ టీవీ రమణమూర్తి, ఆర్‌డీవో డి.వెంకటేశ్వరరావు, తహసీల్దార్‌ డి.శ్రీనివాసరావు, జిల్లాలోని పలు కోర్టుల న్యాయమూర్తులు, కోర్టు ఉద్యోగులు, సిబ్బంది, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న

కేసులను పరిష్కరించండి

హైకోర్టు న్యాయమూర్తి

మానవేంద్రనాథ్‌రాయ్‌

తీర్పులు న్యాయాన్ని ప్రతిబింబింపజేయాలి

హైకోర్టు న్యాయమూర్తి రాజశేఖరరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement