విజయనగరం ఫోర్ట్:
జిల్లాలో నిత్యం ఎక్కడో ఓ చోట ఆడ పిల్లల నుంచి మహిళల వరకు వేధింపులు, లైంగిక దాడులు, అత్యాచారాలకు గురవుతున్నారు. కొందరు మహిళలు ధైర్యంగా ముందుకొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేస్తుంటే.. మరి కొందరు బయటకు పొక్కితే ఎక్కడ సమాజంలో తమ పరువు పోతుందోనన్న ఆందోళనతో ఇంట్లోనే ఆవేదన చెందుతున్నారు. బయటకు చెప్పుకోలేక లోలోపన మదనపడుతున్నారు. ఇంకొందరు మహిళలైతే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలా జిల్లాలో బాలికలు, యువతులు, మహిళల రక్షణ విషయంలో ఆందోళన నెలకొంది. ఇంటి నుంచి బయటకు వెళ్లే వారు మళ్లీ ఇంటికొచ్చే వరకు ఎక్కడ ఏం జరుగుతుందోనన్న ఆందోళన కన్నవారిలో నెలకొంటుంది.
● టీడీపీ జమానాలో పెరిగిన దాడులు
టీడీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత బాలికలు, మహిళలపై వేధింపులు, లైంగిక దాడులు పెరిగిపోయాయి. మహిళలపై దాడులకు పాల్పడిన వారిపై సకాలంలో చర్యలు చేపట్టకపోవడం వల్లే కామాంధులు రెచ్చిపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్నిచోట్ల మహిళలపై వేధింపులకు పాల్పడిన వ్యక్తులకు అధికార పార్టీ నేతలే అండగా నిలుస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. ఆడపిల్లపై చేయి వేస్తే తాట తీస్తాం... అంటూ ఎన్నికల సమయంలోనూ... ఇప్పుడూ బీరాలు పలుకుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ఇప్పుడేమి చేస్తున్నారన్న ప్రశ్న వినిపిస్తోంది. కూటమి సర్కార్ హయాంలో ఈ దాడులు మరింత పెచ్చుమీరాయని అయినా.. తీసుకుంటున్న చర్యలు కంటితుడుపుగానే ఉంటున్నాయన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
వన్‌స్టాప్ సెంటర్‌లో కౌన్సెలింగ్ ఇస్తున్న సిబ్బంది
ఏ సహాయం అవసరమైనా చేస్తున్నాం..
వేధింపులు, హింస వంటి వాటికి గురైన మహిళలు వనస్టాప్ సెంటర్‌కు వస్తే ముందుగా వారిలో ధైర్యం నింపేందుకు కౌన్సెలింగ్ ఇస్తున్నాం. వారికి ఏ సహాయం అవసరమైనా అందిస్తున్నాం. బాలికలు, మహిళల రక్షణ, సంరక్షణ, వైద్య, న్యాయ, వసతి సహాయాల్లో ఏ సాయం అవసరమైతే ఆ సాయం అందిస్తాం.
– పి.సాయివిజయలక్ష్మి,
సెంటర్ అడ్మినిస్ట్రేటర్, వన్‌స్టాప్ సెంటర్
మహిళలపై పెరుగుతున్న దాడులు..!
నిత్యం ఎక్కడో ఓ చోట ఆడ పిల్లలపై దాడులు
టీడీపీ ప్రభుత్వ హయాంలో పెరిగిన వైనం
2024 జనవరి నుంచి డిసెంబర్ వరకు 227 కేసులు నమోదు
2025 జనవరి నుంచి డిసెంబర్ వరకు 225 కేసులు నమోదు
బాలికలు, మహిళలపై లైంగిక, గృహహింస, అత్యాచారాలకు పాల్పడుతున్న మృగాళ్లు
గడిచిన రెండేళ్ల కాలంలో మహిళలపై జరుగుతున్న దాడులకు సంబంధించి జిల్లాలో అధిక సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. 2024, 2025 సంవత్సరాల్లో 452 కేసులు నమోదయ్యాయి. 2024లో 227 కేసులు, 2025లో 225 కేసులు నమోదు అయ్యాయి. గృహ హింస, అత్యాచారాలు, ఫోక్సో, లైంగిక వేధింపులు, వరకట్న వేధింపులు, సైబర్ క్రైమ్, మిస్సింగ్ వంటి కేసులు ఎక్కువగా నమోదయ్యాయి.


