వీరఘట్టం: మండలంలోని తూడి గ్రామం వద్ద శనివారం జరిగిన విద్యుత్ ప్రమాదంలో ఝర్కాండ్‌కు చెందిన మనోజ్‌సింగ్ అనే యువకునికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామం వద్ద ఆర్.డి.ఎస్.ఎస్ పనుల్లో భాగంగా కొత్త విద్యుత్ లైన్లు వేస్తున్నారు. విద్యుత్ ఎక్కి పైభాగంలో పని చేస్తుండగా మనోజ్‌సింగ్ స్తంభం పైనుంచి ప్రమాదవశాత్తు కింద పడిపోవడంతో అతని తలకు తీవ్ర గాయమైంది. వెంటనే సమీపంలో ఉన్న అతని సహచరులు వీరఘట్టం పీహెచ్‌సీకి తీసుకువచ్చారు. ఇక్కడ వైద్య సిబ్బంది క్షతగాత్రునికి ప్రధమ చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్య చికిత్స కోసం పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు.అక్కడి నుంచి అతని సహచరులు అతన్ని విజయనగరం తరలించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా విద్యుత్ పనులు నిర్వహిస్తున్న ప్రదేశంలో సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు చెబుతున్నారు.


