దయనీయం..! | - | Sakshi
Sakshi News home page

దయనీయం..!

Mar 22 2026 2:08 AM | Updated on Mar 22 2026 2:08 AM

దయనీయం..!

విజయనగరం ఫోర్ట్‌: క్షయ రోగులకు సేవలు అందించే జిల్లా క్షయ నివారణ కేంద్రం దయనీయ స్థితికి చేరింది. అయినా పట్టించుకునే వారు కరువయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భవనం పరిస్థితి చూస్తే ఎవరికై నా అయ్యో అనిపిస్తుంది. జిల్లా క్షయ నివారణ కేంద్రం పరిస్థితిని నిత్యం అధికారులు చూస్తున్నా.. ఏ ఒక్కరూ పట్టించుకోకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నామని, అందుకోసం కోట్లాది రుపాయిలు ఖర్చు చేస్తున్నామని చంద్రబాబు సర్కార్‌ గొప్పలు చెబుతుంది. కానీ వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది.

భయానకం..

క్షయ నివారణ కేంద్రం భయానక స్థితిలో ఉంటూ రోగులు, ఉద్యోగులను భయపెడుతుంది. భవనం శిథిలావస్థకు చేరుకొని ఎప్పుడు కూలుతుందో తెలియని దుస్థితి. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని అంతా భయపడుతున్నారు. అయినా ఉన్నతాధికారులు దీనిపై స్పందించడం లేదు.

కృంగిన గచ్చు

క్షయ నివారణ కేంద్రంలో ఐదు గదులు ఉన్నాయి. ఐదు గదుల్లో ఉన్న గచ్చులు కిందకు కృంగిపోయాయి. నడుస్తుంటే గచ్చు కిందకు కృంగిపోవడం వల్ల తూలిపోయి కింద పడిపోయే పరిస్థితి ఉంది. దీంతో క్షయ నివారణ కేంద్రానికి వచ్చే రోగులతో పాటు, ఉద్యోగులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. విద్యుత్‌ మీటరు వద్ద వైర్లు అస్తవ్యస్తంగా వేలాడుతున్నాయి. వైర్లు ప్రమాదకర స్థితిలో ఉన్న ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు. ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఎవరు బాధ్యత వహిస్తారని ఆందోళన నెలకొంది.

రోజుకు 60 నుంచి 70 మంది వరకు రోగులు

జిల్లా క్షయ నివారణ కేంద్రానికి చికిత్స కోసం 60 నుంచి 70 మంది వరకు రోగులు రోజూ వస్తారు. కఫం పరీక్ష నిర్ధారణ అయిన వారికి వైద్యులు చికిత్స అందిస్తారు. హెచ్‌ఐవీ బారిన పడిన వారికి కూడా ఇక్కడ క్షయ నివారణ పరీక్షలు చేస్తారు.

పేరుకు పోయిన చెత్తాచెదారం

క్షయ నివారణ కేంద్రం చుట్టూ చెత్తాచెదారం పేరుకు పోయింది. పిచ్చి మొక్కలు, చెత్త పేరుకు పోవడం వల్ల పారిశుధ్యం ఆధ్వానంగా తయారైంది. దీనికి తోడు విష సర్పాలు ప్రవేశిస్తున్నాయి. కొద్ది రోజులు క్రితం విష సర్పం క్షయ నివారణ కేంద్రంలోకి రావడంతో సిబ్బంది పామును కొట్టి బయట పడేశారు. క్షయ వ్యాధి పరీక్ష చేసుకోవడానికి వచ్చే వారికి అక్కడ అపారిశుధ్యం వల్ల వ్యాధి మరింత ఎక్కువ అయ్యే పరిస్థితి ఉందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తుప్పు పడుతున్న వాహనాలు

క్షయ నివారణ కేంద్రం ఆవరణంలో వాహనాలు తుప్పు పడుతున్నాయి. క్షయ నివారణ కేంద్రం ఉద్యోగులు క్షేత్ర స్థాయి పర్యటనకు గతంలో వాహనాలు ఇచ్చారు. ఆ వాహనాల కాల పరిమిత దాటడంతో వాటిని అలానే వదిలేశారు. టూవీలర్స్‌తో పాటు , జీపులు కూడా అలానే వదిలేశారు. దీంతో ఆ వాహనాలు తుప్పు పట్టి పాడవుతున్నాయి. ఏళ్ల తరబడి తుప్పు పట్టి పాడువుతున్నా వాటిని పట్టించుకునే వారే కరువయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

వాస్తవమే..

క్షయ నివారణ కేంద్రం శిథిలావస్థకు చేరింది. గచ్చులకు కృంగిపోతున్నాయి. భవనం శిథిల స్థితికి చేరింది. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

– డాక్టర్‌ కె.రాణి, జిల్లా క్షయ నివారణ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement