విజయనగరం ఫోర్ట్:
సర్వజన ఆస్పత్రిలో తరచూ వివిధ రకాల మందుల కొరత రోగులను వెంటాడుతోంది. వ్యయప్రయాసలకు గురిచేస్తోంది. ప్రజారోగ్యంపై చంద్రబాబు ప్రభుత్వ అలసత్వాన్ని ఎత్తిచూపుతోంది. పేద రోగులకు కనీసం మందు బిళ్లలు కూడా పూర్తిస్థాయిలో ఇవ్వడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రితో పాటు, పీహెచ్‌సీ, సీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రిల్లో కూడా ఇదే పరిస్థితి ఉందనే ఆరోపణలు ఉన్నాయి.
● ఆస్పత్రే ఆధారమైనా...
పేద, మధ్య తరగతి వర్గాలకు ప్రభుత్వాస్పత్రులే ఆధారం. ఏ మాత్రం అనారోగ్యానికి గురైనా ప్రభుత్వాస్పత్రులకు వెళ్లి ఉచిత వైద్యసేవలు పొందుతారు. అయితే, అక్కడ వైద్యులు రాసిన మందులు ఇవ్వకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. జ్వరం, జలుబు, నీరసం, బీపీ వంటి వ్యాధులకు వినియోగించే మందుల కొరత ఉండడంపై రోగులు మండిపడుతున్నారు.
● జిల్లాలో ఆస్పత్రులు ఇలా...
జిల్లాలో 50 పీహెచ్‌సీలు ఉన్నాయి. బాడంగి, భోగాపురం, నెల్లిమర్ల, బొబ్బిలి సీహెచ్‌సీలు, గజపతినగరం, చీపురుపల్లి, రాజాం, ఎస్.కోటల్లో ఏరియా ఆస్పత్రులు, 18 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ఉన్నాయి. పీహెచ్‌సీలకు రోజుకి 20 నుంచి 30 మంది వరకు, సీహెచ్‌సీకి 60 నుంచి 80 మంది వరకు రోగులు, ఏరియా ఆస్పత్రికి 200 నుంచి 300 మంది, సర్వజన ఆస్పత్రికి 1200 నుంచి 1400 మంది వరకు రోగులు వైద్యం కోసం వస్తారు. అయితే, పలు ఆస్పత్రుల్లో పారాసిట్‌మాల్–500 ఎం.జీ, బి–కాంప్లెక్సు మాత్ర లు, ఎటిన్‌లాల్, ఎమ్లాడోఫిన్, సిట్రిజన్ మాత్రలు, కాలిన గాయాలకు వినియోగించే సిల్వర్ ఎక్స్ అయింట్ మెంట్ కొరత ఉంది. వైద్యులు ఈ మందులను రాసినా రోగులు ప్రైవేటు దుకాణాల్లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
ఆ మాత్రలు సరఫరా కావడం లేదు..
ఎటిన్‌లాల్, ఎమ్లాడోఫిన్, పారాసిట్ మాల్–500 ఎంజి, సిట్రిజన్, బి–కాంప్లెక్సు మాత్రలు సర్వజన ఆస్పత్రికి సరఫరా లేదు. సిల్వర్ ఎక్స్ ఆయింట్ మెంట్ కూడా రావడం లేదు.
– బి.సన్యాసినాయుడు,
ఫార్మసీ ఆఫీసర్, సెంట్రల్ డ్రగ్ స్టోర్
ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో
మందుల కొరత
పీహెచ్‌సీ, సీహెచ్‌సీ, ఏరియా
ఆస్పత్రుల్లోనూ అదే పరిస్థితి..!
కాలిన గాయాలకు ఉపయోగించే
సిల్వర్‌ఎక్స్ ఆయింట్‌మెంట్‌కు కటకట
ఎటిన్‌లాల్, ఎమ్లాడోఫిన్, సిట్రిజన్
మందుల కొరత
బి–కాంప్లెక్స్ మాత్రలూ లేవు
ప్రైవేటు దుకాణాల్లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి
గంట్యాడ మండలానికి చెందిన భవానీ అనే మహిళకు కాలు కాలిపోవడంతో సర్వజన ఆస్పత్రిలో చూపించింది. అక్కడి వైద్యులు మాత్రలతో పాటు సిల్వర్‌ఎక్స్ ఆయింట్‌మెంట్ రాశారు. అది పట్టుకుని మందులగది దగ్గరకు వెళ్తే సిల్వర్‌ఎక్స్ అయింట్ మెంట్ సరఫరా లేదని చెప్పడంతో ప్రైవేటు మందుల దుకాణంలో రూ.170 పెట్టి కొనుగోలు చేశారు.
విజయనగరం పట్టణానికి చెందిన సత్యారావు అనే వ్యక్తి తలనొప్పి ఎక్కువగా ఉండడంతో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి వచ్చారు. అక్కడ వైద్యులు బీపీ చెక్ చేయగా బీపీ ఉందని తేలడంతో మందులు రాసి ఇచ్చారు. అదిపట్టుకుని ఫార్మసీ గది వద్దకు వెళ్తే అతను వైద్యుడు రాసిన ఎమ్లాడోఫిన్ మాత్రలు లేవని చెప్పడంతో ఇంటికి వెళ్లి పోయారు.


