విధులకు డుమ్మా..!
● ఉదయం 11:30 గంటలకు టెలిమెడిసిన్ విభాగం ఖాళీ
విజయనగరం ఫోర్ట్:
జిల్లా కేంద్రంలోని ఘోషా ఆస్పత్రిలోని టెలిమెడిసిన్ హబ్ వైద్యులు శనివారం ఉదయం విధులకు డుమ్మాకొట్టారు. ఉదయం11:30 గంటల ప్రాంతంలో ఒక్క వైద్యుడు కూడా టెలిమెడిసిన్ హబ్‌లో లేరు. కుర్చీలు, కంప్యూటర్లు ఖాళీగా దర్శనమిచ్చాయి. ఈ హబ్‌లో ఎంబీబీఎస్ వైద్యులు ఇద్దరు, జనరల్ మెడిసిన్ ఒకరు, పిడియాట్రిసిన్ ఒకరు, గైనికాలజిస్ట్ ఒకరు పనిచేస్తున్నారు. ఉదయం 9 నుంచి సాయింత్రం 4 గంటల వరకు విధులు నిర్వహించాలి. విలేజ్ హెల్త్ క్లినిక్‌లు, పీహెచ్‌సీల వైద్య సిబ్బంది దగ్గరకు వచ్చిన రోగుల్లో స్పెషలిస్ట్ వైద్యం అవసరమైన వారికి టెలిమెడిసిన్ హబ్‌లో ఉన్న వైద్యులకు వీడియో కాల్ చేస్తారు. సంబంధిత రోగికి జనరల్ మెడిసిన్, పిడియాట్రిసిన్, గైనికాలజీ విభాగాల్లో సేవలందిస్తారు. అయితే హబ్‌లో ఒక్కరూ లేకపోవడంతో సేవలు అందని ద్రాక్షగా మారాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సూర్యనారాయణ స్పందిస్తూ టెలిమెడిసిన్ హబ్‌లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు విధులు నిర్వహించాలని, అందుబాటులో లేని వైద్యులపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు.


