అర్జీల పరిష్కారమే పరమావధి
● పెండింగ్ దస్త్రాలపై అధికారులు దృష్టి పెట్టాలి ● కలెక్టర్ డా.ఎన్ ప్రభాకర రెడ్డి
పార్వతీపురం రూరల్: ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, ఒకసారి పరిష్కరించిన సమస్య మళ్లీ పునరావృతం కాకూడదని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి, డీఆర్వో కె. హేమలతతో కలిసి ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. పారదర్శకమైన సేవలందించడమే లక్ష్యంగా పీజీఆర్‌ఎస్ పనిచేయాలని, నిర్దిష్ట గడువులోగా సమస్యలు పరిష్కరిస్తూ పెండింగ్‌లో ఉన్న దస్త్రాలపై ఆయా శాఖల అధికారులు వ్యక్తిగతంగా దృష్టి సారించాలని ఈ సందర్భంగా కలెక్టర్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజలు అధికారులకు విన్నవించారు. పార్వతీపురంలోని బంగారమ్మ కాలనీలో ఇళ్ల ముందు కాలువ నీరు రోడ్లపైకి వస్తోందని, కాలువలను వెడల్పు చేసి సమస్య తీర్చాలని స్థానికులు కోరారు. కురుపాం మేజర్ పంచాయతీ పరిధిలో అనుమతులు లేకుండా సుమారు 88 ఎకరాల్లో ఏర్పాటు చేసిన అక్రమ లేఅవుట్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆదివాసీ గిరిజన సంఘం ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు. గుమ్మలక్ష్మీపురం మండలం కితలంబ గ్రామంలో 20 పేద కుటుంబాలు నివసిస్తున్నా ఇప్పటికీ విద్యుత్ సౌకర్యం లేదని, స్తంభాలు, ట్రాన్‌న్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు వేడుకున్నారు. బలిజిపేట మండలం నూకలవాడలో రేషన్ డీలర్ పోస్టు ఖాళీగా ఉందని, మరణించిన మాజీ డీలర్ కుటుంబ సభ్యురాలినైన తనకు అవకాశం ఇవ్వాలని ఓ మహిళ అభ్యర్థించగా, కురుపాం మండలం బొడ్డమానుగూడ గ్రామాన్ని దూరంగా ఉన్న తిత్తిరి పంచాయతీ నుంచి తప్పించి సమీపంలోని జరడ పంచాయతీలో విలీనం చేయాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఎస్పీ పీజీఆర్‌ఎస్‌కు 11 ఫిర్యాదులు
పార్వతీపురం రూరల్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల ఇబ్బందులను చట్టపరిధిలో పరిష్కరిస్తున్నట్లు ఎస్పీ ఎస్.వీ.మాధవ్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన అర్జీదారుల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. బాధితులతో ముఖాముఖి మాట్లాడి, సమస్యల పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబకలహాలు, సైబర్ మోసాలు, వడ్డీ వ్యాపారుల వేధింపులు, ఆస్తి వివాదాల వంటి అంశాలపై సోమవారం మొత్తం 11 ఫిర్యాదులు అందాయి. వాటిపై ఎస్పీ తక్షణమే స్పందించి సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, క్షేత్రస్థాయి వాస్తవాలను పరిశీలించాలని సూచించారు. ఫిర్యాదులో వాస్తవముంటే చట్టప్రకారం చర్యలు తీసుకుని, నివేదిక పంపాలని ఆదేశించారు. కార్యక్రమంలో సీఐలు ఆదాం, అప్పారావు, ఎస్సై రమేష్ నాయుడు పాల్గొన్నారు.
ఐటీడీఏ పీజీఆర్‌ఎస్‌కు 14 వినతులు
సీతంపేట: ఐటీడీఏలో ఏపీఓ చిన్నబాబు ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకు 14 వినతులు వచ్చాయి. పెండింగ్ హౌసింగ్ బిల్లులు చెల్లించాలని భామిని మండలం పోలిష్‌కోటకు చెందిన గిరిజనులు వినతి ఇచ్చారు. మెట్టుగూడకు చెందిన సవర జగదీశ్వరరావు మంచినీటి సౌకర్యం కోసం బోరు ఏర్పాటు చేయాలని కోరారు. టెండర్ల ద్వారా సరఫరా చేసిన కూరగాయలకు బిల్లులు చెల్లించాలని బూర్జకు చెందిన చిన్నంనాయుడు కోరారు. ప్రాథమిక పాఠశాలకు ప్రహరీ నిర్మించాలని ఇరపాడుగూడకు చెందిన ముఖలింగం విన్నవించారు. విద్యుత్‌లైన్లు ఇంటిపై నుంచి వెళ్తున్నాయని, వాటిని సరిచేయాలని చొర్లంగికి చెందిన గిరిజనులు వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
అర్జీల పరిష్కారమే పరమావధి
అర్జీల పరిష్కారమే పరమావధి


