మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య
చీపురుపల్లి: పెళ్లి అవడం లేదనే మనస్తాపంతో మండలంలోని కర్లాం గ్రామానికి చెందిన కోరాడ వెంకటేష్(32) అనే యువకుడు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటనకు సంబంధించి జీఆర్‌పీ ఎస్‌ఐ ఎం.మధుసూదనరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కర్లాం గ్రామానికి చెందిన వెంకటేష్ ఆదివారం రాత్రి చీపురుపల్లి రైల్వేస్టేషన్ నుంచి బాతువ వైపు వెళ్లే రైల్వేట్రాక్‌పై రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు కుటుంబసభ్యులకు సమాచారం అందించి పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని వారికి అప్పగించినట్లు ఎస్సై మధుసూదనరావు చెప్పారు.
ప్రమాద కారకులకు జైలుశిక్ష
గజపతినగరం: మూడునెలల క్రితం రోడ్డుప్రమాదంలో పలువురు వ్యక్తులను వాహనాలతో ఢీకొట్టి ప్రమాదాలకు కారుకులైన ఇద్దరు వ్యక్తులకు స్థానిక ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ జూనియర్ సివిల్ జడ్జ్ ఎ.విజయ్ రాజ్‌కుమార్ జైలు శిక్ష విధించారని స్థానిక కోర్టు సిబ్బంది సోమవారం తెలిపారు.గజపతినగరానికి చెందిన వంగర సాంబశివరావు కారునడుపుతూ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి ప్రమాదానికి కారకుడైనట్లు రుజువు కావడంతో జడ్జి విజయ్ రాజ్ కుమార్ రూ.500జరిమానాతో పాటు 3నెలలు జైలుశిక్ష విధించినట్లు తెలిపారు.అలాగే దత్తిరాజేరు మండలం పెదమానాపురం గ్రామానికి చెందిన బెహర కృష్ణ అనే వ్యక్తి లారీని నడుపుతూ మరో లారీని ఢీకొట్టి ప్రహాదానికి కారకుడైనట్లు రుజువు కావడంతో ఆయనకు మూడునెలల జైలు శిక్ష విధించినట్లు చెప్పారు.
కోడి పందాల రాయుళ్ల అరెస్టు
రేగిడి: మండలంలోని గుళ్లపాడు గ్రామ సమీపంలోని మామిడితోటలో కోడి పందాలు ఆడుతున్న 8 మందిని సోమవారం పట్టుకున్నామని ఎస్సై వి.బాలకృష్ణ విలేకరులకు తెలిపారు. వారి నుంచి రూ.9,010 స్వాధీనం చేసుకుని అరెస్టు చేశామన్నారు. ఎక్కడైనా కోడి పందాలు, పేకాట శిబిరాలు నిర్వహిస్తే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
ఎన్‌టీఆర్ విగ్రహం ధ్వంసం చేసిన కేసులో ఇద్దరి అరెస్ట్
లక్కవరపుకోట: మండలంలోని సీతారాంపురం గ్రామం జంక్షన్‌లో గల మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు విగ్రహాన్ని ఈ నెల 15వ తేదీ రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై గ్రామానికి చెందిన తూర్పాటి కిశోర్‌కుమార్ ఫిర్యాదు మేరకు ఎస్సై నవీన్‌పడాల్ కేసు నమోదు చేసి ఇద్దరు నిందుతులైన సీతారాంపురం గ్రామానికి చెందిన తూర్పాటి అనిల్, కొట్యాడ పంచాయితీ శివారు నాయుడుపేట గ్రామానికి చెందిన జుత్తాడ రవిచంద్రరావులను గొల్జాం జంక్షన్ వద్ద సోమవారం అదుపులోకి తీసుకుని విజయనగరం డీఎస్పీ ఆర్.గోవిందరావు సమక్షంలో విలేకరుల సమావేశంలో హాజరు పరిచి వివరాలను వెల్లడించారు.ఈ సందర్భంగా డీఎస్పీ గోవిందరావు మాట్లాడుతూ ఇద్దరు నిందితులను కొత్తవలస జూనియర్ సివిల్ జడ్జి ముందు హాజరు పరచనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీఐ ఎల్.అప్పలనాయుడు,పలువురు కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.
గుళికలు కలిసిన ధాన్యం తిని తొమ్మిది మేకల మృతి
మక్కువ: గుళికలు కలిసిన ధాన్యం తిని తొమ్మిది మేకలు మృతి చెందాయి. మండలంలోని కొండ బుచ్చంపేట గ్రామానికి చెందిన మేకలకాపరి జెర్రి సుధాకర్ తన 20 మేకలను గ్రామ సమీపంలోకి మేతకోసం కనుమ పండుగ రోజున తోలుకువెళ్లాడు. పొలంగట్లపై మేస్తున్న మేకలన్నీ పక్కనే ఉన్న ఈశ్వరరాజు ఆయిల్ పామ్ తోటలోకి ప్రవేశించి, గుంపుగా మేత మేస్తున్నాయి. తోటలో గుళికల వాసన రావడంతో మేకలకాపరి సుధాకర్ పరుగున వచ్చి చూడగా, గుళికలు కలిసిన ధాన్యం మేకలు తింటుండడాన్ని చూసి వెంటనే మేకలను బయటకు పంపించి వేసి, పశువైద్య సిబ్బందికి సమాచారం అందించాడు. సంఘటన స్థలానికి వైద్యసిబ్బంది చేరుకునేలోపు ఐదు మేకలు మృతిచెందగా, చికిత్స పొందుతూ మరో నాలుగు మేకలు మత్యువాత పడ్డాయి. పశువైద్య సిబ్బంది మంగళవారం మేకలు తిన్న ధాన్యాన్ని శాంపిల్స్ సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య
మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య


