సమస్యల పరిష్కారంలో అలసత్వం కూడదు
కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి
పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్ విశేష
స్పందన
177 వినతుల స్వీకరణ
విజయనగరం అర్బన్: కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తరలివచ్చి తమ సమస్యలపై వినతి పత్రాలు, ఫిర్యాదులు అందజేశారు. అందిన మొత్తం 177 వినతుల్లో అత్యధికంగా 86 రెవెన్యూ శాఖకు సంబంధించి ఉన్నాయి. ఆ తర్వాత డీఆర్‌డీఏ–33, పంచాయతీ రాజ్–13, గ్రామ సచివాలయ శాఖ–6, విద్యుత్ శాఖ–3, డీఎంహెచ్‌ఓ–3, ఇతర శాఖలు–26, హౌసింగ్–2, డీసీసీహెచ్–1, విద్యాశాఖ–1 వినతి అందాయి. ఈ సందర్భంగా కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి మాట్లాడుతూ పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్ వినతుల పరిష్కారంలో వేగం పెంచాలని, ఆలస్యం చేస్తే సహించనని స్పష్టం చేశారు. రెవెన్యూ సమస్యలపై వచ్చిన వినతులను సకాలంలో పరిష్కరించాలని రెవెన్యూ అధికారులు, సంబంధిత జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్‌ను నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి కలిసి చెప్పుకున్న సమస్యలపై స్పందిస్తూ వెంటనే చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. డిజిటల్ పర్యవేక్షణపై దృష్టి సారిస్తూ 1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా అందిన కాల్స్‌పై బాధ్యతగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. ప్రతి వారం పీజీఆర్‌ఎస్ పురోగతిని స్వయంగా సమీక్షిస్తానని తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్, జిల్లా రెవెన్యూ అధికారి ఈ.మురళి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు డి.వెంకటేశ్వరరావు, రాజేశ్వరి, ప్రమీలగాంఽధీ, బి.శాంతి, కళావతి, ఆర్‌డీఓలు దాట్ల కీర్తి, సత్యవాణి, రామ్మోహనరావు తదితర అధికారులు పాల్గొన్నారు.


