ఆర్టీసీ బస్సు బోల్తా
ఏడుగురికి గాయాలు
డ్రైవర్‌కు అకస్మాత్తుగా ఫిట్స్ రావటంతో తిరగబడిన బస్సు
చీపురుపల్లిరూరల్(గరివిడి): చీపురుపల్లి–రాజాం ప్రధాన రహదారిలో సోమవారం పెనుప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సు బోల్తా పడిన సంఘటనలో ఏడుగురుకి గాయాలు కాగా మిగిలిన ప్రయాణికులంతా క్షేమంగా బయటపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు సోమవారం ఉదయం 10:30 గంటల సమయంలో రాజాం డిపో నుంచి ప్రయాణికులతో చీపురుపల్లి వైపు ఆర్టీసీ బస్సు బయల్దేరింది. ఈ బస్సు బయల్దేరిన కొన్ని నిమిషాల వ్యవధిలో 11 గంటల సమయంలో అప్పన్నవలస–కాపుశంభాం జంక్షన్‌ల వద్దకు చేరుకునే సరికి బస్సును నడిపే డ్రైవర్ పి.అప్పలగురువులకు అకస్మాత్తుగా ఫిట్స్(మూర్ఛవ్యాధి) వచ్చింది. డ్రైవర్ స్టీరింగ్ నియంత్రణ కోల్పోవడంతో రోడ్డు సమీపంలో ఉన్న మొక్కజొన్న పంటభూమిలోకి ఒక్కసారిగా బోల్తా పడింది. బస్సు బోల్తా పడటంతో ఒక్కసారిగా ప్రయాణికుల నుంచి పెద్ద ఎత్తున అరుపులు, కేకలు వినిపించడంతో స్థానికులు సంఘటన ప్రాంతానికి పరుగులు తీశారు. ఈ సమాచారం మేరకు డీఎస్పీ ఎస్.రాఘవులు సూచనలతో సీఐ జి.శంకరరావు, ఎస్సై బి.లోకేశ్వరరావులు సంఘటన ప్రాంతానికి చేరుకుని పోలీస్ సిబ్బందితో సత్వరం రక్షణ చర్యలు చేపట్టారు. బస్సు ఎదుట ఉండే అద్దాన్ని పగలగొట్టి ప్రయాణికులను బయటకు తీసి పోలీసు వాహనంలోను, అంబులెన్సులోను చీపురుపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో వైె ద్య సిబ్బంది వెంటనే స్పందించి అవసరమైన వారికి ఎక్స్‌రేలు తీసి, గాయాలైన వారికి ప్రథమ చికిత్స అందించారు.
బస్సులో 85 మంది ప్రయాణికులు
ఆర్టీసీ బస్సులో 85 మంది ప్రయాణీకులు ప్రయాణిస్తుండగా వారిలో 51 మంది మహిళలు ఉన్నారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణాపాయం లేకుండా అంతా క్షేమంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంలో రాజాం మండలం జోగివలస గ్రామానికి చెందిన కొయ్యాన రాము, ఆదర్శనగర్ కాలనీకి చెందిన డోకలి సాయి విశాలాక్ష్మి, తెర్లాం మండలం పెరుమాళి గ్రామానికి చెందిన వెలగాడ పార్వతి, సంతకవిటి మండలం తాలాడ గ్రామానికి చెందిన మల్లిక ప్రణీత, పూసపాటిరేగ మండలం రెల్లివలస గ్రామానికి చెందిన పతివాడ జయమ్మ, పతివాడ సత్యం, తెర్లాం మండలం జగన్నాథవలస గ్రామానికి చెందిన సిద్ధాంత లక్ష్మి గాయపడ్డారు.
ఆర్టీసీ బస్సు బోల్తా


