బినామీ రవాణా ఏజెన్సీలపై చర్యలు తీసుకోండి
● మంత్రి నాదెండ్లకు రైతు సంఘం నాయకుల వినతి
విజయనగరం ఫోర్ట్/డెంకాడ/భోగాపురం/బొండపల్లి: జిల్లాలోని రైతులు వాహన చార్జీలు చెల్లించి ధాన్యాన్ని మిల్లులకు తరలించారని, పీఏసీఎస్ సిబ్బంది బినామీ రవాణా ఏజెన్సీల ద్వారా ఆ చార్జీలను దుర్వినియోగం చేశారని ఏపీ రైతు సంఘం కార్యదర్శి బి.రాంబాబు, ఆదినారాయణ ఆరోపించారు. వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌కు జెడ్పీ అతిథిగృహంలో మంగళవారం వినతిపత్రం అందజేశారు. మంత్రి డెంకాడ మండలం పెదతాడివా డ, భోగాపురం, బొండపల్లి మండలోని రాచకిండాం గ్రామాల్లో పర్యటించారు. ధాన్యం కొనుగోళ్లుపై ఆరా తీశారు. రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన డబ్బులను సంక్రాంతికి ముందే రైతు ల ఖాతాలకు జమయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. రైతులు ధాన్యంను మిల్లుకు తరలించే క్రమంలో చాలా చోట్ల మిల్లర్లు ఇబ్బందులు కలిగిస్తు న్న విషయం తమ దృష్టికి వచ్చిందని, అధికారులు అటువంటివారిపై కఠినచర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటివరకు జిల్లా రైతుల నుంచి రూ.607కోట్లు విలువైన ధాన్యం సేకరించినట్టు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే నాగమాధవి, రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్ ఢిల్లీరావు, కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి, జేసీ సేతుమాధవన్, పౌర సరఫరాల జిల్లా మేనేజెర్ శాంతి, ఆర్డీఓ కీర్తి పాల్గొన్నారు.


