ప్రచారం మీదా? | - | Sakshi
Sakshi News home page

ప్రచారం మీదా?

Jan 7 2026 7:14 AM | Updated on Jan 7 2026 7:14 AM

ప్రచారం మీదా?

ప్రచారం మీదా?

ఘనత మాది..

ప్రభుత్వంపై మాజీ ఉపముఖ్యమంత్రి, మాజీ ఎమ్మెల్యే ధ్వజం

పార్వతీపురం రూరల్‌: గత ప్రభుత్వం నిర్మించిన భవనాలు, ఆస్పత్రులు, ప్రాజెక్టులకు రంగులు మార్చి, రిబ్బన్లు కట్‌ చేసి తామే నిర్మించామంటూ చంద్రబాబు ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని మాజీ ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర, మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఎద్దేవా చేశారు. ఈ మేరకు పార్వతీపురంలోని ఆర్యవైశ్య కల్యాణ మంటపంలో మంగళవారం వైఎస్సార్సీపీ జిల్లా విస్తృతస్థాయి సమావేశం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.

అప్పుల్లో రికార్డు..అభివృద్ధిలో శూన్యం

అధికారం చేపట్టిన 18 నెలల్లోనే రూ.3 లక్షల కోట్ల అప్పులు చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర విమర్శించారు. గత ప్రభుత్వంపై అప్పుల నిందలు వేసిన వారు, ఇప్పుడు రిజర్వ్‌ బ్యాంక్‌ వద్ద క్యూ కట్టి మరీ అప్పులు తెస్తున్నారని దుయ్యబట్టారు. సాలూరు ఆస్పత్రికి ఒక్క ఇటుక కూడా వేయని మంత్రి, ఇప్పుడు 80 శాతం పనులు పూర్తయిన తర్వాత తానే కట్టించానని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. గిరిజన ప్రాంతాల్లో రోడ్ల పనులను నిలిపివేసి, పార్టీ మారితేనే రోడ్లు వేస్తామంటూ బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

‘పర్మిషన్లు తెచ్చింది జగన్‌..ఫోజులు బాబువి

భోగాపురం విమానాశ్రయం విషయంలో చంద్రబాబు ‘క్రెడిట్‌ చోర్‌’లా వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే జోగారావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 2019కి ముందు ఎలాంటి అనుమతులు లేకుండా కొబ్బరికాయ కొట్టిన చంద్రబాబు, ఇప్పుడు తానే విమానాశ్రయాన్ని కట్టానని చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. కోర్టు కేసులను పరిష్కరించి, గ్రీన్‌ ట్రిబ్యునల్‌ అనుమతులు సాధించి, 2,751 ఎకరాల భూసేకరణ జరిపి, రైతులకు పరిహారం అందించి పనులు పరుగులు పెట్టించింది తమ అధినేత జగన్మోహన్‌ రెడ్డేనని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ స్వయంగా జగన్మోహన్‌ రెడ్డి కృషిని ప్రశంసించిన వీడియోలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. 2026 నాటికి విమానాశ్రయం పూర్తి చేస్తామని ఆనాటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్‌ రెడ్డి మాట ఇచ్చారని, ఆ దిశగానే పనులు సాగాయని గుర్తు చేశారు. అమ్మఒడి పథకాన్ని కాపీ కొట్టి ‘తల్లికి వందనం’ అని పేరు మార్చిన చంద్రబాబు, అచ్చమైన ‘నేమ్‌ చేంజర్‌’ అని విమర్శించారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌ రాజు, మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మావుడి శ్రీనివాసరావు, జెడ్పీ వైస్‌ చైర్మన్‌ బాపూజీ నాయుడు, అనుబంధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement