ఆంజనేయస్వామి విగ్రహం ధ్వంసంపై ఫిర్యాదు
రామభద్రపురం: మండలంలోని ఆరికతోటలో ఇటీవల ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి అంజనేయ స్వామి విగ్రహ ధ్వంసానికి పాల్పడిన ఘటనపై చర్యలు తీసుకోవాలని గ్రామపెద్దలు, ప్రజలు, హిందూ భక్తులు మంగళవారం బొబ్బిలి డీఎస్పీ భవ్యరెడ్డి, తహసీల్దార్ అజూ రఫీజాన్‌లకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. మండల పరిధిలోని ఆరికతోట నుంచి పాతరేగ గ్రామానికి వెళ్లే జంక్షన్ పక్కన ఉన్న స్థలం యజమాని బోదంకి రామేశ్వరరావు గడిచిన 40 ఏళ్ల క్రితం ఆంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్టించారు. అయితే కొద్ది సంవత్సరాల తర్వాత గజపతినగరానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి సత్యనారాయణకు ఆ స్థలం విక్రయించగా ఆంజనేయ విగ్రహం ఆ స్థలంలో నిర్మాణాలకు అడ్డుగా ఉందన్న ఉద్దేశంతో రియల్‌ఎస్టేట్ వ్యాపారి ఆ విగ్రహాన్ని గునపాలతో తవ్వేసి ఇటీవల తొలగించాడు. దీంతో గ్రామ పెద్దలు, ప్రజలు, హిందూ భక్తులు ఆగ్రహం వ్యక్తంచేసి ఫిర్యాదు చేశారు. బాధ్యులైన స్థల యజమానిపై చర్యలు తీసుకుని మళ్లీ విగ్రహం ప్రతిష్టించేలా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. డీఎస్పీ భవ్యరెడ్డి, సీఐ కె. నారాయణరావు, ఎస్సై వి.ప్రసాదరావులు స్పదించి ఆరికతోట గ్రామ పెద్దలు, ప్రజలతో పాటు ఆంజనేయ స్వామి విగ్రహం తొలగించిన బాధ్యుడు సత్యనారాయణను స్థానిక పోలీస్ స్టేషన్‌కు పిలిచి విచారణ చేసి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. మళ్లీ ఆంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్టించేలా చర్యలు తీసుకోవాలని గ్రామపెద్దలు వారి అభిప్రాయం తెలియజేయగా, పూర్తి దర్యాప్తు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని డీస్పీ చెప్పారు.


