9న జిల్లాస్థాయి నృత్య పోటీలు
పార్వతీపురం: జిల్లావ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు–2026ను పురస్కరించుకుని నృత్యపోటీలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా.ఎన్. ప్రభాకరరెడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన మాట్లాడుతూ జిల్లా సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా ఈ పోటీలు నిర్వహించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ పోటీలను రెండు కేటగిరీల్లో నిర్వహించాలని 15ఏళ్ల లోపు వారు ఒక కేటగిరిలోను 15ఏళ్లకంటే ఎక్కువ ఉన్నవారిని రెండో కేటగిరిగా విభజించనున్నట్లు తెలిపారు. పోటీల్లో గిరిజన నృత్యాలు, జానపద నృత్యాలు, దేశభక్తి నృత్యాలు మాత్రమే ప్రదర్శించాల్సి ఉంటుందన్నారు. మండల స్థాయి పోటీలను జనవరి 7లోగా నిర్వహించి విజేతలను ఎంపిక చేయాల్సి ఉంటుందన్నారు. మండల స్థాయి విజేతలకు జిల్లాస్థాయిలో జనవరి 9న మధ్యాహ్నం 3గంటలకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో విజేతలుగా నిలిచిన వారికి ప్రథమ బహుమతిగా రూ.5వేలు, ద్వితీయ బహుమతి రూ. 2,500లు, తృతీయ బహుమతి రూ.1500లు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. డీఈఓను నోడల్ అధికారిగా నియమించి ఎంపీడీఓలు, ఎంఈఓలు, సాంస్కృతిక కమిటీ సభ్యులతో ఈ పోటీలను నిర్వహించేలా ఆదేశాలు జారీ చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.


