చేతికి అందివచ్చాడనుకుంటే..
● ట్రాక్టర్ ఢీకొని యువకుడి దుర్మరణం
పార్వతీపురం రూరల్: విధి ఆ కుటుంబంపై పగబట్టింది. చిన్నతనంలోనే తల్లి ప్రేమకు దూరమైన ఆ బిడ్డ.. పెరిగి పెద్దవాడై చేతికి అందివచ్చాడనుకునేలోపే మృత్యువు కబళించింది. కష్టాల కడలిని ఈది రెండు కుటుంబాలకు ’పెద్ద దిక్కు’గా నిలిచిన ఆ యువకుడిని రోడ్డు ప్రమాదం రూపంలో మరణం ఎత్తుకెళ్లిపోయింది. గరుగుబిల్లి మండలం తోటపల్లిలో ఆదివారం రాత్రి జరిగిన ఈ విషాద ఘటన స్థానికులను కంటతడి పెట్టించింది. ఈ ఘటనపై పోలీసుల కథనం మేరకు.. తోటపల్లి గ్రామానికి చెందిన రాయపల్లి సతీష్(29) బొబ్బిలిలోని ఓ నిర్మాణ సంస్థలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. ఎప్పటిలాగానే ఆదివారం విధులు ముగించుకుని, రాత్రి 10.30 గంటల సమయంలో ద్విచక్రవాహనంపై స్వగ్రామం బయలుదేరాడు. మార్గమధ్యంలో అడ్డాపుశీల గ్రామం వద్దకు రాగానే.. ఎదురుగా అతివేగంగా దూసుకొచ్చిన ట్రాక్టర్ సతీష్ బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సతీష్ ఘటనాస్థలిలోనే ప్రాణాలు విడిచాడు.
’అమ్మ లేని లోటు తెలియకుండా..
సతీష్ చిన్నతనంలోనే కన్నతల్లిని కోల్పోయాడు. తండ్రి రాయపల్లి సుదర్శనన్‌రావు కూలి పనులు చేస్తూ కొడుకును చదివించాడు. మరోవైపు సతీష్ చిన్నాన్న, పిన్నిలకు సంతానం లేకపోవడంతో..సతీష్‌నే తమ కన్నబిడ్డగా పెంచుకున్నారు. రెండు పేద కుటుంబాలకు సతీష్ ఒక్కడే ఆధారం. సూపర్‌వైజర్‌గా స్థిరపడి, తన జీతంతో రెండు ఇళ్లనూ పోషిస్తూ, వారికి చేదోడు వాదోడుగా నిలుస్తున్నాడు. ఇంతలోనే మృత్యువు ఆ ఇంటి వెలుగును ఆర్పివేసింది. ‘మా కష్టాలు తీరుస్తాడనుకున్న కొడుకు.. కానరాని లోకాలకు వెళ్లిపోయాడంటూ‘ తండ్రి సుదర్శన్‌నరావు, కుటుంబసభ్యులు గుండెలు బాదుకుంటూ రోదించిన తీరు చూపరులను కలిచివేసింది.


