ఉత్తరాంధ్ర సుజల స్రవంతిపై సమీక్ష
విజయనగరం అర్బన్: విజయనగరం జిల్లాలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కాలువల నిర్మాణం, భూసేకరణ తదితర అంశాలపై నీటి పారుదల శాఖ అధికారులతో రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా విజయనగరం జిల్లాలో కొత్తగా రానున్న ఆయకట్టు, కాలువల నిర్మాణం కోసం చేపట్టాల్సిన భూసేకరణ తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అలైన్మెంట్‌ను సాంకేతికంగా అన్నీ అంశాలను పరిగణనలోకి తీసుకోవటం ద్వారా జిల్లాలో పెద్ద ఎత్తున ఆయకట్టు పెరిగే విధంగా చర్యలు చేపట్టాలని, అవసరమైన మేరకు విడతల వారీగా భూసేకరణను చేపట్టడం ద్వారా రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా నీటి పారుదల శాఖ అధికారులు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కాలువల నిర్మాణానికి సంబంధించిన డిజైన్‌ను మంత్రికి చూపించి, ఈ అంశంపై మరింత లోతైన చర్చను జరిపి తుది రూపు తీసుకొస్తామని వివరించారు. త్వరలో ఈ అంశంపై ఉన్నత స్థాయి సమీక్ష జరుగుతున్న నేపథ్యంలో అతి త్వరలోనే పూర్తిస్థాయి డిజైన్‌ను రూపొందిస్తామని, విడతల వారీగా భూసేకరణకు తగిన కార్యాచరణ చేపడతామని మంత్రికి వివరించారు. సమీక్ష సమావేశంలో కార్యనిర్వాహక ఇంజినీర్ ఉమేష్‌కుమార్, డీఈ లక్ష్మీసుధ, ఏఈలు వివేక్, శారద పాల్గొన్నారు.


