ఉత్సాహంగా ‘వాక్‌థాన్’
విజయనగరం క్రైమ్:
మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా పోలీస్‌శాఖ విశాఖ రేంజ్ పరిధిలోని ఐదు జిల్లాల్లో చేపట్టిన అభ్యదయ సైకిల్‌యాత్ర ముగింపును పురస్కరించుకుని విజయనగరం జిల్లాలో శనివారం చేపట్టిన ‘వాక్‌థాన్’ ఉత్సాహంగా సాగింది. విజయనగరం బాలాజీ కూడలి వద్ద ప్రారంభమైన వాక్‌థాన్‌కు ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ పచ్చజెండా ఊపారు. సింహాచలం మేడ, కోట జంక్షన్ మీదుగా మూడులాంతర్ల కూడలి వరకు సాగింది. గంజాయి, మాదక ద్రవ్యాలవల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతో రేంజ్ ఐజీ గోపీనాథ్ జట్టి రేంజ్ పరిధిలో ‘అభ్యుదయ సైకిల్ యాత్ర’ను నిర్వహించారన్నారు. ఈ యాత్ర విజయనగరం జిల్లాలోని అన్ని మండలాల్లోనూ సాగిందని, ప్రజలు, యువతకు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించినట్టు వెల్లడించారు. ముగింపునకు చిహ్నంగా ‘వాక్ థాన్’ నిర్వహించామన్నారు. గంజాయి అమ్మకాలు, వినియోగించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో విజయనగరం ఇన్‌చార్జి డీఎస్పీ ఆర్.గోవిందరావు, సీఐలు ఎ.వి.లీలారావు, ఆర్‌వీఆర్‌కే చౌదరి, టి.శ్రీనివాసరావు, సీహెచ్ సూరినాయుడు, బి.లక్ష్మణరావు, ఇ.నర్సింహమూర్తి, ఆర్‌ఐ ఎన్.గోపాలనాయుడు పాల్గొన్నారు.
యువత మాదకద్రవ్యాల జోలికి పోవద్దు
రాజాం సిటీ: యువత మాదక ద్రవ్యాల జోలికి పోవద్దని చీపురుపల్లి డీఎస్పీ ఎస్.రాఘవులు అన్నారు. రాజాం పట్టణంలో శనివారం వాక్‌థాన్ నిర్వహించారు. బొబ్బిలి రోడ్డులోని పోలిపల్లి పైడితల్లి అమ్మవారి ఆలయం నుంచి జీఎంఆర్ ఐటీ వరకు మూడు కిలోమీటర్ల మేర వాక్‌థాన్ సాగింది. కార్యక్రమంలో సీఐలు అశోక్‌కుమార్, ఉపేంద్ర, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


