చోరీ బాటలో దంపతులు
రాజాం సిటీ: ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. విలాసాలకు అలవాటు పడ్డారు. ఈ క్రమంలో దొంగతనానికి పాల్పడి బంగారు ఆభరణాలు చోరీ చేశారు. చోరీ చేసిన బంగారు నగలను తాకట్టుపెట్టి ఆ నగదుతో హైదరాబాద్, గోవా, కర్నాటక, భువనేశ్వర్ ప్రాంతాల్లో విలాసంగా గడిపారు. చివరకు పోలీసులకు చిక్కి కటకటలాపాలయ్యారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను రాజాం రూరల్ సర్కిల్ కార్యాలయంలో సీఐ హెచ్.ఉపేంద్ర శుక్రవారం విలేకరులకు వెల్లడించారు. రేగిడి మండలం బాలకవివలస గ్రామానికి చెందిన డోల గాయత్రి ఇంటర్మీడియట్ చదువుకుని ఓ కంపెనీలో పనిచేసేది. అదే కంపెనీలో పనిచేస్తున్న బాపట్ల జిల్లా చీరాల మండలం వైకుంఠపురం గ్రామానికి చెందిన దుడ్ల బాలాజీతో ప్రేమలో పడి వివాహం చేసుకుంది. అప్పటి నుంచి వారిద్దరూ బాలకవివలసలో నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నారు. ఇదిలా ఉండగా గత నెల 4న బాలకవివలస గ్రామానికి చెందిన కిల్లారి కమల ఇంట్లో దొంగతనం జరిగిన విషయాన్ని గుర్తించి ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన ఇంట్లో 13 తులాల బంగారం అపహరణకు గురైందని ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు కేసు నమోదు చేసి సవాల్‌గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి గ్రామానికి చెందిన గాయత్రి, బాలాజీలపై అనుమానంతో ఆరా తీసి నిందితులుగా గుర్తించారు. వారు గ్రామంలో లేకపోవడంతో గాలింపు చేపట్టారు. నిందితులు దొంగిలించిన బంగారాన్ని శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో కొన్ని ఆభరణాలు, బాపట్ల జిల్లా చీరాలలో ఓ ప్రైవేట్ కంపెనీలో కొన్ని ఆభరణాలు తాకట్టు పెట్టారు. ఆ సొమ్ముతో హైదరాబాద్, గోవా, భువనేశ్వర్‌లలో విలాసాలకు ఖర్చుచేశారు.
చిన్నారి కోసం వచ్చి..పట్టుబడిన దంపతులు
తమ నాలుగు నెలల చిన్నారిని తీసుకుని వెళ్లేందుకు బాలకవివలస వచ్చిన నిందితులను సమాచారం మేరకు పట్టుకున్నామని సీఐ తెలిపారు. వారి నుంచి రూ.ఒక లక్షతో పాటు రెండు చెవిదిద్దులు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించామన్నారు. ఇంకా మిగిలిన బంగారం రికవరీ చేయాల్సి ఉందని వెల్లడించారు. ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన రేగిడి క్రైం సిబ్బంది ఎస్.శ్రీనివాసరావు, ఎస్.రామకృష్ణ, ఆర్.శివరావు, కె.మోహనరావులను సీఐ అభినందించారు. కార్యక్రమంలో ఎస్సై వి.బాలకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.
బాలకవివలసలో నిందితుల అరెస్టు


