పరిశ్రమలకు అనుమతుల్లో జాప్యం వద్దు
విజయనగరం అర్బన్: జిల్లాలో పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేయడం లక్ష్యంగా పెట్టుకుని పరిశ్రమల స్థాపనకు వచ్చే దరఖాస్తులను నిబంధనలకు అనుగుణంగా అతి త్వరలో పరిష్కరించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా పరిశ్రమల సమీక్షా సమావేశంలో ఆయన దిశానిర్దేశం చేశారు. పారిశ్రామికవేత్తలు దరఖాస్తు సమర్పించిన తర్వాత చట్టబద్ధమైన గడువు ముగిసేవరకు వేచి చూడకుండా వెంటనే వాటిని పరిశీంచి అనుమతులు మంజూరు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఏ శాఖ వద్ద అయినా అనుమతులు పెండింగ్‌లో ఉంటే పరిశ్రమల శాఖ అధికారులు తక్షణమే స్పందించి సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని సమస్యలు పరిష్కరించాలని సూచించారు. జిల్లాకు వచ్చే పారిశ్రామికవేత్తలకు జిల్లా యంత్రాంగం తరఫున పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని కలెక్టర్ భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లాలో కొత్తగా ఏర్పాటు కానున్న 8 ప్రధాన పరిశ్రమల పరోగతిపై ఆయన ప్రత్యేకంగా సమీక్షించారు. సూపర్ స్మెల్టర్స్ లిమిటెడ్, స్టీల్ ఎక్స్చేంజ్ ఇండియా లిమిటెడ్, స్టీల్ ఎక్స్చేంజ్ ఎన్‌ఫ్రా లాజిస్టిక్స్ లిమిటెడ్, అన్సుమి స్పేస్ కార్పొరేషన్, జేఎస్‌డబ్ల్యూ ఇండస్ట్రీస్ పార్క్ లిమిటెడ్, వైశాఖి గ్రోత్ కారిడార్, రుషిల్ డెకర్స్, ఎలైట్లాజిక్స్ ఎగ్జిమ్ ఏజెన్సీ ఇండియా లిమిటెడ్ వంటి కంపెనీలు జిల్లాలో యూనిట్లు స్థాపించేందుకు ముందుకు వచ్చాయని కలెక్టర్ వెల్లడించారు. ఈ పరిశ్రమల ద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశాలు లభిస్తాయన్నారు. సమావేశంలో పరిశ్రమల శాఖ ఇన్‌చార్జ్ జనరల్ మేనేజర్ ఎంవీ కరుణాకర్, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ ఎం.మురళీమోహన్‌రెడ్డి ఇతర జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాంసుందర్‌రెడ్డి


