ఏజెన్సీ ఫలసాయాలకు ఒడిశాలో డిమాండ్
● పెరిగిన పుట్టదబ్బ, నారింజ, పెండలం, గుమ్మడి దిగుబడులు
● గిట్టుబాటు ధరలు పూజ్యం ● దళారులే దిక్కు
సీతంపేట: ఏటా ఈ సీజన్‌లో పండే గిరిజనుల ప్రధాన అటవీఫలసాయాలైన పెండలం, పుట్టదబ్బ, గుమ్మడి వంటి వాటికి ఒడిశాలో మంచి డిమాండ్ ఉంది. అయితే అనుకున్నంత స్థాయిలో గిట్టుబాటు ధరలు లేకపోవడంతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది కంటే ఈ సంవత్సరం దిగుబడులు పెరిగినా మద్దతు ధరలు లేవు. దళారులు గుమ్మడి పండు ఒక్కోటి రూ.20కి ఇక్కడ కొనుగోలు చేస్తారు. మైదాన ప్రాంతంలో రూ.80 వరకు పండును బట్టి కిలోల వంతున విక్రయిస్తారు. పెండలం కూడా ఇక్కడ కట్టలుగా అంచనాగా 30 కిలోల పెండలం కట్టను రూ.300కు కొనుగోలు చేస్తే అది రూ.500వరకు ఒడిశాలో అమ్ముతారు. అలాగే దబ్బ కావిళ్ల లెక్కన రూ.200కు కొనుగోలు చేస్తారు. సరాసరి ఒక్కో పుట్ట దబ్బ పండు రూపాయి ధర పలుకుతుంది. అయితే ఈ దబ్బ తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు ఒడిశాలోని బరంపురానికి ఎగుమతి అవుతాయి. అక్కడ రూ.3 వరకు ఒక్కో పుట్ట దబ్బను విక్రయిస్తారు. పచ్చళ్ల కంపెనీలకు ఈ తరహా పుట్టదబ్బను విక్రయిస్తారు. ఇక నారింజపండు ధరలు కూడా అలాగే ఉన్నాయి. ఇక్కడ ఒక పండు రూ.2కి కొనుగోలు చేసిన వ్యాపారులు మైదాన ప్రాంతాల్లో రూ.6 వరకు విక్రయిస్తారు. ఏజెన్సీలో పెండలం వంద హెక్టార్లలో, పుట్టదబ్బ, నారింజ, సాధారణ దబ్బ 500, గుమ్మడి 50 హెక్టార్లలో పండుతుంది. ఈ సీజన్‌లో ఇదే గిరిజనులకు ఇదే ప్రధాన ఆదాయ వనరు. గతంతో పోలిస్తే ఈ సంవత్సరం దిగుబడులు ఉన్నా ధరలు లేవని గిరిజన రైతులు వాపోతున్నారు. సోమవారం సీతంపేట, బుధవారం మర్రిపాడు, గురువారం దోనుబాయి, శనివారం పొల్ల, కుశిమి వారపు సంతలకు వాటిని గిరిజనులు తీసుకువస్తారు. లారీలు, వ్యాన్‌లలో వచ్చిన వ్యాపారులు కొనుగోలు చేసి తీసుకువెళ్తారు.
కోల్డ్ స్టోరేజీ లేక అవస్థలు
కోల్డ్ స్టోరేజీ సౌకర్యం లేక గిరిజనులు అవస్థలు పడుతున్నారు. ఏజెన్సీలో పండే ఉత్పత్తులను నెలలకొద్దీ నిల్వ చేసి ధరలు అత్యదికంగా ఉన్న సమయంలో విక్రయించుకోవడానికి వీలుగా సీతంపేటలో పదేళ్ల క్రితం కోల్డ్ స్టోరేజినీ ఏర్పాటు చేశారు. అయితే దానిపై గిరిజనులకు చైతన్యం లేకపోవడంతో ఎవరూ వినియోగించడం లేదు. దీంతో అది మూలన పడింది. దబ్బ, నారింజ, అరటితో పాటు సీజన్‌లలో లభ్యమయ్యే పైనాపిల్, చింతపండు వంటివి నిల్వ చేసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. అటవీ ఫలసాయాల విక్రయంలో గిరిజనులు నష్టాలు చవిచూస్తున్నారు. మరోవైపు ఈ తరహా ఉత్పత్తులను గిరిజన సహకార సంస్థ కూడా కొనుగోలు చేయని పరిస్థితి ఉందని పలువురు గిరిజన రైతులు వాపోతున్నారు.
ఏజెన్సీలో లభించే
గుమ్మడి
వ్యాపారులు
కొనుగోలు
చేసిన పెండలం
గిరిజనులు
విక్రయిస్తున్న
నారింజ, పుట్టదబ్బ
నష్టాలు తప్పడం లేదు
ప్రతి
సంవత్సరం ఆదాయం వస్తుందనుకున్న సమయంలో నష్టాలు వస్తున్నాయి. దీంతో అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలకు ధరలు లేకపోవడంతో మిగతా పంటలు ఎలా పండించుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది.
ఎస్.మల్లయ్య, వజ్జాయిగూడ
దళారులదే హవా
అటవీ ఉత్పత్తులు తీసుకువచ్చినా దళారుల హవా సాగుతోంది. కొన్నేళ్లుగా మన్యంలో పండే పంటలు దళారుల పాలవడంతో మాకు రావాల్సిన ఆదాయ వనరులు తగ్గుతున్నాయి. దీంతో నష్టాలు చవిచూస్తున్నాం. ప్రభుత్వ పరంగా గిరిజన రైతులను ఆదుకోవాలి.
ఎస్.సన్నాయి, అక్కన్నగూడ
ఏజెన్సీ ఫలసాయాలకు ఒడిశాలో డిమాండ్
ఏజెన్సీ ఫలసాయాలకు ఒడిశాలో డిమాండ్


