కలియ దున్నితే కలదు లాభం
● వరి వ్యర్థాలను ఉపయోగించుకోవాలి
● రబీకి సిద్ధమవుతున్న రైతులకు సూచన
భామిని: ఖరీఫ్ పంటకాలం పూర్తయింది. పొలాల నుంచి ధాన్యం కళ్లాలకు, మిల్లులకు చేరుతున్నాయి. కోత నూర్పిడి యంత్రాల సహాయంతో పొలాల్లో వరి చేను గడ్డి కుప్పలు తెప్పలుగా పడింది. పశువుల పెంపకం తగ్గడంతో వరి గడ్డి అవసరాలు గణనీయంగా పడిపోయాయి. పొలాల్లో పంట వ్యర్థాలు పేరుకుపోతున్నాయి.ఈ తరుణంలో రబీ పంటలకు సిద్ధమవుతున్న రైతాంగం వరిగడ్డిని తగులబెట్టడాన్ని వ్యవసాయ అధికారులు వ్యతిరేకిస్తున్నారు. పొలంలోని వరి కొయ్యలతో పాటు మిగతా పంటలైన పత్తి, జొన్న, మిరప వ్యర్థాలను కుప్పలు పోసి తగలబెట్టడంతో కలిగే దుష్పరిణామాలు వివరిస్తున్నారు. ఈ పంట వ్యర్థాలు తగలబెట్టడంతో వాతావరణంలో ఉష్ణోగ్రత పెరుగుతుందని, ఆ వేడితో భూమి సారాన్ని కోల్పోతుందని హెచ్చరిస్తున్నారు. పంట వ్యర్థాలు తగులబెట్టే సమయంలో విడుదలయ్యే పొగ వల్ల తీవ్ర వాతావరణ కాలుష్యంతో పాటు రైతుల ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని సూచిస్తున్నారు. రబీ వరి కోసం పొలాలను దున్నే క్రమంలో అగ్నికి ఆహుతి చేసి చెడు ప్రభావాలు తెచ్చుకోవద్దని హితవు పలుకుతున్నారు. వరికోత పొలాల్లో విస్తారంగా పడిన వరిగడ్డి కుప్పలు, ఇతర పంటలు పూర్తయిన తరువాత వచ్చే వ్యర్థాలను తొలగించడానికి ఖర్చులు అవుతాయనే నెపంతో రైతాంగం అగ్నికి ఆహుతి చేయడం తగదని, గడ్డి కుప్పలను తగలబెట్టడంతో భూమి సారం తగ్గుతుందని హెచ్చరిస్తున్నారు. పంటను కాపాడే కోట్ల సంఖ్యంలో సూక్ష్మజీవులు, బాక్టీరియా, శిలీంధ్రాలు, వానపాములు, నులిపురుగులు నాశనం అవుతాయి. మంటల తాకిడి ఫలితంగా పంటను కాపాడవలసిన భూమి పొరల్లోని సూక్ష్మజీవులు నాశనమై పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతాయని తెలియజేస్తున్నారు.
కలియ దున్నడం మంచిది
పంటకాలం పూర్తయ్యాక వ్యర్థాలను నేలలో కలియ దున్నడం వల్ల సేంద్రియ కర్బన శాతం పెరుగుతుంది. పంట దిగుబడి పది శాతం పెరగవచ్చు. వ్యర్థాలను దుక్కి దున్నే సమయంలో సూపర్‌ఫాస్పేట్ చల్లితే గడ్డి అవశేషాలు రెండు వారాల్లో మురిగి పోషకాలుగా మారతాయి. ఫలితంగా డీఏపీ వాడకం సగం వరకు తగ్గుతుంది. పచ్చిరొట్టను కలియదున్నితే తర్వాత వేసే పంటకు ఎరువుగా మారి పంట దిగుబడులు పెరుగుతాయి.
కొల్లి తిలక్, వ్యవసాయాదికారి, భామిని
కలియ దున్నితే కలదు లాభం
కలియ దున్నితే కలదు లాభం
కలియ దున్నితే కలదు లాభం


