జేఎన్‌టీయూ జీవీలో నూతన సంవత్సర వేడుకలు
● హిల్లాక్ వాకింగ్ ట్రాక్ ప్రారంభం
● క్యాలెండర్‌ను ఆవిష్కరించిన
ఉప కులపతి వీవీ సుబ్బారావు
విజయనగరం రూరల్: విజయనగరం జేఎన్‌టీయూ గురజాడ విశ్వవిద్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఉప కులపతి వీవీ సుబ్బారావు కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జేఎన్‌టీయూ గురజాడ విశ్వవిద్యాలయం ఉత్తరాంధ్ర ప్రాంతానికే తలమానికమన్నారు. కొత్త ఏడాదిలో విశ్వవిద్యాలయం మరింత అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలని, ఈ అభివృద్ధిలో అధికారులు, ఆచార్యులు, విద్యార్థులు, సిబ్బంది భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని కోరారు. దీనిలో భాగంగా గతేడాది ప్రారంభించిన ‘ఆరోగ్యం కోసం ఒక గంట–ప్రకృతితో’ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ప్రాంగణంలో కొండపై, పచ్చటి చెట్ల మధ్య, ఆహ్లాదకరమైన వాతావరణంలో నూతనంగా ఏర్పాటు చేసిన హిల్లాక్ వాకింగ్ ట్రాక్‌ను ప్రారంభించారు. అనంతరం విశ్వవిద్యాలయం నూతన క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ జి.జయసుమ, అధికారులు, ఆచార్యులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
జేఎన్‌టీయూ జీవీలో నూతన సంవత్సర వేడుకలు


