‘మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్’ విజేతలకు బహుమతులు
విజయనగరం అర్బన్: జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ గణిత ఫోరం (ఏపీఎంఎఫ్) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన ‘మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్’లో ప్రతిభచూపి విజేతలుగా నిలిచిన పదిమందికి జిల్లా విద్యాశాఖ అధికారి యూ.మాణిక్యం నాయుడు బుధవారం బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ గణితం విద్యార్థుల తార్కిక శక్తిని, సమస్యల పరిష్కార నైపుణ్యాలను పెంపొందిస్తుందని తెలిపారు. ఇటువంటి పోటీపరీక్షలు విద్యార్థుల్లో గణితంపై ఆసిక్తిని పెంచేందుకు ఎంతో దోహదపడతాయన్నారు. వెయ్యిమంది పాల్గొన్న ఈ పోటీల్లో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు తరగతికి ఇద్దరు వంతున 10 మంది విజేతలను ఎంపిక చేశారని తెలిపారు. విజేతలలో 10వ తరగతికి సుంకర జ్యోతి (బొండపల్లి జెడ్పీహెచ్‌ఎస్), జి.గౌస్ (మున్సిపల్ హైస్కూల్ విజయనగరం, 9వ తరగతికి ఎల్.నిత్యసారథి (శ్రీరాంనగర్ హైస్కూల్), జి.శ్రుతి (అయ్యన్న పేట హైస్కూల్), 8వ తరగతికి మజ్జి యోషిత (గర్భాం హైస్కూల్), ఎం.కుసుమ (పెంట జెడ్పీహెచ్‌స్కూల్), 7వ తరగతికి టి.మోహిత్ కుమార్ (గర్భాం ఏపీ మోడల్ స్కూల్), ఎ.నిహారిక (ఎంపీయుపీ స్కూల్, జీసీపల్లి), 6వ తరగతికి కాళ్ల హర్హప్రియ(జరజాపుపేట హైస్కూల్), వై.మోక్షిత (నెల్లిమర్ల జెడ్పీహెచ్‌స్కూల్) విజేతలుగా నిలిచారు. కార్యక్రమంలో ఏపీహెచ్‌ఎం జిల్లా అధ్యక్షుడు ఎం.వేణుగోపాలరావు, ఏపీఎంఎఫ్ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు సిద్ధాంతం త్రినాథరావు, రాష్ట్ర కార్యదర్శి వి.చిన్నంనాయుడు, జిల్లా అధ్యక్షుడు కె.రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఎస్.బంగారయ్య పాల్గొన్నారు. అనంతరం గణిత ఫోరం రూపొందించిన గణిత క్యాలెండర్లను డీఈఓ యూ.మాణిక్యం నాయుడు ఆవిష్కరించారు.


