విజయనగరం సబ్ జైలు ఆకస్మిక తనిఖీ
విజయనగరం లీగల్: జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ (ఎన్‌ఎఎల్‌ఎస్‌ఎ) న్యూఢిల్లీ ఆదేశాలతో విజయనగరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత బుధవారం స్థానిక సబ్ జైలును ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జైలులో ఉన్న ఖైదీల స్థితిగతులు, వారికి అందుతున్న వసతులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం జైలు ఆవరణలో ఖైదీలకు నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె మాట్లాడుతూ ఖైదీల పట్ల సిబ్బంది గాని, తోటి ఖైదీలు గానీ ఎటువంటి వివక్ష చూపరాదని స్పష్టం చేశారు. వివక్షకు తావులేకుండా చూడాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా ఆమె ఉదహరించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని జైలు సూపరింటెండెంట్‌ను హెచ్చరించారు. ఖైదీలు నేర ప్రవృత్తిని విడనాడి, మారుమనస్సు పొంది సమాజంలో ఉత్తమ పౌరులుగా మెలగాలని హితవు పలికారు. రిమాండ్‌లో ఉన్న ముద్దాయిలెవరూ న్యాయవాది లేక ఇబ్బంది పడకూడదని, అటువంటి వారికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తరఫున ఉచిత న్యాయ సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. జైలులోని లీగల్ ఎయిడ్ క్లినిక్ పనితీరును, పారా లీగల్ వలంటీర్ల సేవలను ఆమె పర్యవేక్షించారు. జైలులోని వంటగది, భోజనశాల, స్టోర్ రూమ్‌లను జిల్లా జడ్జి స్వయంగా తనిఖీ చేశారు. స్టోర్ రూమ్‌లో ఉన్న పప్పు దినుసులు, నిత్యావసర సరుకుల నాణ్యతను పరిశీలించి, వంటశాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాల్గవ అదనపు న్యాయమూర్తి బి.అప్పలస్వామి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్, సబ్‌జైలు సూపరింటెండెంట్ కేఎస్‌ఎన్.మూర్తి, లీగల్ ఎయిడ్ కౌన్సిల్ సభ్యులు, పారా లీగల్ వలంటీర్లు పాల్గొన్నారు.
ఖైదీలతో జిల్లా జడ్జి ముఖాముఖి


