న్యాయవ్యవస్థపై నమ్మకం గెలిపించింది
● మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ రాఘురాజు
శృంగవరపుకోట: న్యాయస్థానంపై ఉంచుకున్న నమ్మకం గెలిచింది. వ్యవస్థలు మమ్మల్ని పట్టించుకోక పోయినా, న్యాయం గెలిపించిందని జిందాల్ నిర్వాసితులు, ఎమ్మెల్సీ రఘురాజు, రైతుసంఘ జిల్లా ఉపాధ్యక్షుడు చల్లా జగన్ తదితరులు అన్నారు. జిందాల్ నిర్వాసితులను యథాతథంగా వారి భూముల్లో ఉంచాలని, కోర్టు ఇచ్చిన ప్రాథమిక ఆదేశాల ప్రతులతో బుధవారం ఆయన బొడ్డవరలో గల ఎమ్మెల్సీ రఘురాజు ఇంటివద్ద మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రఘురాజు మాట్లాడుతూ 2008నుంచి జిందాల్ భూముల్లో రైతులే ఉన్నారు. వారి భూములు వారే సాగు చేసుకుంటున్నారన్న విషయం అందరికీ తెలుసని, జిందాల్ నాడు భూసేకరణ సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, దౌర్జన్యంగా భూముల్లోకి చొరబడి, ఏళ్ల వయస్సున్న ఫల వృక్షాలను కూల్చేసిందన్నారు. న్యాయం కోసం 200 రోజులు శాంతియుత పోరాటం చేసినా ఎవరూ పట్టించుకోకపోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించామన్నారు. నేడు కోర్టు ఇచ్చిన తీర్పుతో న్యాయవ్యవస్థపై నమ్మకం మరోమారు నిలబడిందన్నారు. ఇప్పుడు 33మంది నిర్వాసితులకు అనుకూలంగా తీర్పు వచ్చిందని, మరో 150 మంది రైతులు కోర్టును ఆశ్రయించనున్నట్లు చెప్పారు. నిర్వాసితులు అందరికీ న్యాయం జరిగే వరకూ ఉమ్మడి న్యాయపోరాటానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. సమావేశంలో ఎస్.కోట ఎంపీపీ సొండి సోమేశ్వరరావు, వేర్వేరు పంచాయతీల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జిందాల్ నిర్వాసిత రైతులు పాల్గొన్నారు.


