సౌత్ ఇండియా బాడీబిల్డింగ్ పోటీల్లో జైత్రయాత్ర
విజయనగరం: చైన్నె వేదికగా డిసెంబర్ 28న నిర్వహించిన సౌత్ ఇండియా బాడీ బిల్డింగ్ కాంపిటిషన్‌లో విజయనగరం జిల్లా క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచి జిల్లా పేరును జాతీయస్థాయిలో మార్మోగించారని మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన తన నివాసంలో విజయం సాధించిన క్రీడాకారులను ఘనంగా సత్కరించి, అభినందనలు తెలిపారు. 80 కేజీల కేటగిరీలో అద్భుత ప్రదర్శనతో బ్రాంజ్ మెడల్ సాధించి జాతీయస్థాయిలో సత్తా చాటిన ఎస్.కె.సుభాన్, అలాగే 55 కేజీల కేటగిరీలో జి.రమేష్ నాలుగవ స్థానం, జూనియర్ విభాగంలో ఆరవ స్థానం సాధించి ప్రశంసలు అందుకున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో విజయనగరం పేరు మార్మోగేలా కృషి చేసిన క్రీడాకారుల పట్టుదల, శ్రమ ప్రశంసనీయమని కోలగట్ల వీరభద్ర స్వామి అన్నారు.
జిల్లా బాడీబిల్డింగ్ అసోసియేషన్ హర్షం
విజయనగరం జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు కనకల కృష్ణ, సెక్రటరీ బైక్ రమేష్ విజేతలను అభినందిస్తూ, జిల్లా నుంచి ఇలాంటి ప్రతిభావంతులు ముందుకు రావడం ఎంతో ఆనందదాయకమని హర్షం వ్యక్తం చేశారు. క్రీడాకారులకు అసోసియేషన్ తరఫున పూర్తి సహకారం అందిస్తామన్నారు. ఈ విజయాలతో విజయనగరం జిల్లా బాడీ బిల్డింగ్ రంగంలో మరోసారి తన సత్తా నిరూపించిందన్నారు.


