అంగరంగ వైభవంగా మెట్లోత్సవం
● గిరి ప్రదక్షిణకు పోటెత్తిన భక్తులు ● ఉత్తరద్వారం నుంచి భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు
● అంగరంగ వైభవంగా కోదండరాముని మెట్లోత్సవం ● వేలాదిగా తరలివచ్చిన భక్తజనం
గిరి ప్రదక్షిణలో భాగంగా బోడికొండ
చుట్టూ సీతారామలక్ష్మణుల ఉత్సవ
విగ్రహాలతో ప్రదక్షిణలు చేస్తున్న భక్తులు
నెల్లిమర్ల రూరల్:
సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం గిరి ప్రదక్షిణకు భక్తజనం పోటెత్తారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా రామతీర్థం బోడికొండ చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అంచనాలకు మించి సుమారు 20వేల మంది భక్తులు శ్రీ కోదండ రామస్వామి కొలువై ఉన్న బోదికొండ(నీలాచలం పర్వతం) చుట్టూ 8 కిలోమీటర్లు కాలినడకన ప్రదక్షిణ చేసి తరించారు. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం వరకు కొనసాగిన ఈ మహా ఘట్టంలో విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల నుంచి భక్తులు వేలాదిగా పాల్గొన్నారు. రామనామాన్ని జపిస్తూ గిరి ప్రదక్షిణ నిర్వహించారు.
ఉత్తర మార్గం – ముక్తి ధామం
ముక్కోటి ఏకాదశి పర్వదినాన ఉత్తర మార్గం నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. మూడు కోట్ల ఏకాదశితో సమానమైన రోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. స్వామివారికి ఆరాధన, తిరుప్పావై సేవాకాలం, మంగళాశాసనం, తీర్థగోష్ఠి కార్యక్రమాలను నిర్వహించిన తరువాత వేకువజామున 5గంటలకు ఉత్తర ద్వారం నుంచి స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు ఆ మార్గం నుంచే లోపలికి ప్రవేశించి స్వామివారిని అత్యంత భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. అనంతరం శ్రీ సీతారామస్వామి వారి ఉత్సవ విగ్రహాలను మంగళవాయిధ్యాలతో ఊరేగింపుగా తీసుకువెళ్లి తిరువీధి ఉత్సవాన్ని జరిపించారు.
జనసంద్రం
ఈ ఏడాది గిరి ప్రదక్షిణకు భక్తులు సంఖ్య గణనీయంగా పెరిగింది. కోలాటాలు, తప్పెటగుళ్లు, మంగళ వాయిద్యాల నడుమ అశేష భక్తజనం రామనామాన్ని జపిస్తూ భక్తి శ్రద్ధలతో గిరి ప్రదక్షిణ నిర్వహించారు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ ఉత్సాహంగా గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. గిరి ప్రదక్షిణలు చేసిన అనంతరం దిగువనున్న ప్రధాన ఆలయంలో ఉత్తర మార్గం నుంచి స్వామి దర్శనం చేసుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తును నిర్వహించారు. ఎస్పీ ఏఆర్ దామోదర్, సాధు పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు స్వామిజీ శ్రీనివాసనంద సరస్వతి, ఎమ్మెల్యేలు పూసపాటి అదితి గజపతిరాజు, లోకం మాధవి, నడుకుదిటి ఈశ్వరరావు, ఎంపీపీ అంబళ్ల సుధారాణి, వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అంబళ్ల శ్రీరాములనాయుడు, నగర పంచాయతీ వైస్ చైర్మెన్ సముద్రపు రామారావు, తదితరులు స్వామిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.
రహదారిలో నడిచేందుకు భక్తులు అష్టకష్టాలు
గిరి ప్రదక్షిణ రహదారి గతంలో మట్టితో ఉండడంతో భక్తులు ఆ మార్గంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా నడిచి వెళ్లేవారు. ఏడాదిన్నర క్రితం తారు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసి రహదారిని పూర్తి చేయకుండా మధ్యలో వదిలేశారు. చిప్స్ వేసి సరిపెట్టడంతో భక్తులు అష్టకష్టాలు పడ్డారు. రాళ్ల పిక్కలు కాళ్లకి గుచ్చుకోవడంతో చాలా మంది మధ్యలోనే నడకను ఆపేశారు. వృద్ధులు, చిన్నారుల పరిస్థితి మరింత కష్టంగా మారింది. రహదారి నిర్మాణానికి ఏడాదిన్నర సరిపోలేదా.. అంటూ పలువురు భక్తులు స్థానిక ఎమ్మెల్యే తీరుపై మండిపడ్డారు. చిప్స్ వేసి నరకాన్ని చూపించారని.. మట్టి రహదారిగా ఉంచినా సరిపోయేదని ఆవేదన వ్యక్తం చేశారు.
బోడికొండపై కొలువుదీరిన శ్రీ కోదండరామస్వామివారి మెట్లోత్సవం కోలాటాలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాల నడుమ కనుల పండువగా సాగింది. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన శ్రీవారి సేవా భక్తులు ఆలయానికి చేరుకునే మెట్లను శుభ్రం చేసి పసుపు, కుంకుమలతో బొట్లు పెట్టి అలంకరించారు. ఈ సందర్భంగా అర్చకులు గోపూజను చేపట్టి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ప్రారంభించగా వేలాది మంది భక్తులు స్వామి వారి విగ్రహాలతో ఊరేగింపుగా నడిచి వెళ్లారు.
వేణుగోపాలస్వామిని దర్శించుకున్న జెడ్పీ చైర్మన్
జామి: ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా పురాతన ప్రసిద్ధిగాంచిన అన్నంరాజుపేట పంచాయతీ పుష్పగిరి వేణుగోపాలస్వామిని జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మంగళవారం కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అంగరంగ వైభవంగా మెట్లోత్సవం
అంగరంగ వైభవంగా మెట్లోత్సవం
అంగరంగ వైభవంగా మెట్లోత్సవం
అంగరంగ వైభవంగా మెట్లోత్సవం


