అన్నదాతకు కలిసిరాని 2025
విజయనగరం ఫోర్ట్: అన్నదాతకు 2025 సంవత్సరం కలిసి రాలేదు. ఏడాది పొడువునా రైతులు సాగు చేయడానికి అష్టకష్టాలు పడ్డారు. విత్తు నుంచి పంట విక్రయం వరకు అవస్థలు పడ్డారు. ఖరీఫ్ సీజన్ ఆరంభం నుంచి రైతులకు కష్టాలు మొదలయ్యాయి. విత్తనాల కోసం రైతులు ఇబ్బంది పడ్డారు. ప్రభుత్వం రాయితీపై ఇచ్చే విత్తనాలు పూర్తి స్థాయిలో సరఫరా చేయకపోవడంతో మార్కెట్‌లో అధిక ధరకు కొనుగోలు చేశారు. వాటిని విత్తుదామంటే వర్షాలు సకాలంలో కురవకపోవడంతో సాగు ఆలస్యం అయింది. వర్షాలు కురిసిన తర్వాత ఆలస్యంగా పంటల సాగు చేపట్టారు.
ఎరువుల కోసం పాట్లు
అష్టకష్టాలు పడి సాగు చేసినప్పటకీ పంట ఎదుగుదలకు అవసరమైన ఎరువు దొరక్కా అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. డీఏపీ, యూరియా ఎరువుల కోసం పడిన అవస్థలు అన్నీఇన్నీ కావు. ముఖ్యంగా యూరియా కోసం రైతు సేవ కేంద్రాలు, ప్రైవేటు డీలర్లు వద్ద ఉదయం నుంచి రాత్రి వరకు వరుసలో నిరీక్షించేవారు. గతంలో ఎన్నడు లేని విధంగా పోలీసు బందోబస్తు మధ్య యూరియా రైతులకు అందించిన పరిస్థితి. అందరికి యూరియా దొరికింది అంటే అదిలేదు. ఇచ్చే ఒక్క బస్తా యూరియా కోసం పడిగాపులు కాసినా రైతులకు దొరికేది కాదు. దీంతో కొంతమంది రైతులు 28–28–0 వంటి కాంప్లెక్సు ఎరువు ధర రూ.1700 అయినా కొనుగోలు చేసి వేసేవారు. యూరియా ఆలస్యంగా వేయడం వల్ల దాని ప్రభావం పంట దిగుబడిపై కూడా పడింది. కొంతమంది డీలర్లు ఇదే అదునుగా యూరియా, డీఏపీ ఎరువులను కృత్రిమ కొరత సృష్టించారు. ఇదే అదనుగా యూరియా, డీఏపీలను అధిక ధరలకు విక్రయించారు. కొంతమంది డీలర్లు అయితే యూరియా కావాలంటే జింక్ గుళికలు అంటగట్టేవారు. యూరియా బస్తా రూ.267 అయితే దానికి అదనంగా రూ.500 విలువ చేసే గుళికలు, జింక్‌గాని అంటగట్టేవారు.
తెగుళ్లతోనూ అవస్థలు
అష్టకష్టాలు పడి ఎరువులు పంటకు వేశారు. ఈ తరు ణంలో పంటపై తెగుళ్లు, చీడపీడలు దాడి చేశా యి. వరి పంటకు సంబంధించి ఆకుముడుత, పాముపొడ, అగ్గి తెగులు, సుడిదోమ ఆశించడంతో వాటిని నివారించడానికి రైతులు వేలాది రుపాయిలు ఖర్చు చేశారు.
మోంథా తుపాన్‌తో నష్టం
పంట చేతికి వచ్చే సమయంలో మోంథా తుఫాన్ తో పంటలు దెబ్బతిన్నాయి. వరి, మొక్కజొన్న, పత్తి, అరటి వంటి పంటలకు నష్టం వాటిల్లింది. దెబ్బతిన్న పంటలకు ఇప్పటకీ చంద్రబాబు సర్కార్ పరిహారం ఇచ్చిన దాఖలాలు లేవు.
పంటల బీమాకు మంగళం
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రైతులకు ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేసింది. రైతులు సాగు చేసిన పంటలకు ఈ – క్రాప్ ఆధారంగా ఆయా పంటలకు ప్రభుత్వమే పంటల బీమా ప్రీమియం చెల్లించేది. చంద్రబాబు సర్కార్ ఉచిత పంటల బీమా ప్రీమియంకు మంగళం పాడేసింది. రైతులకు బీమా చెల్లింపు ఆర్థిక భారం కావడంతో పంటల బీమాకు దూరం అయ్యారు.
బస్తాకు 2నుంచి 4 కేజీల వరకు కోత
రైతుల నుంచి మిల్లర్లు అడ్డంగా దోచేస్తున్నారు. 80 కేజీల బస్తాకు 2నుంచి 4 కేజీల వరకు మిల్లర్లు కోత పెడుతున్నారు. దీని వల్ల రైతులు ఎకరానికి రూ.2 వేలు నుంచి రూ.3 వేల వరకు నష్టపోతున్నారు. మద్దతు ధరలోనూ కోత విధిస్తున్నారు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకు రూ.2369 చెల్లించాలి. కాని దళారులు క్వింటాకు రూ.2వేలు రూ.2100 మాత్రమే చెల్లిస్తున్నారు.
ట్రక్ షీట్‌లో 40 కేజీల నమోదు
ట్రక్ షీట్‌లో 40 కేజీల బస్తా అని ధాన్యం కొనుగోలు కేంద్రాల సిబ్బంది నమోదు చేస్తున్నారు. మిల్లు వద్ద మాత్రం 41 కేజీలు చొప్పన ధాన్యం లెక్కిస్తున్నారు. ఎందుకని రైతులు అడిగితే గోనె సంచు బరువంటున్నారు. ప్రస్తుతం ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దగాని రైతులు సొంతంగా కొనుగోలు చేసిన గోనె సంచులుగాని రూ.50 గ్రాములకు మించి ఉండవు. అవి కూడా 80 కేజీలు సంచులు. 80 కేజీల బస్తాకు 2కేజీలు అదనంగా తీసుకుంటున్నారు. తేమ శాతం పేరుతో మిల్లర్లు 2 నుంచి 4 కేజీల వరకు తీసుకుంటున్నారు. ఇలా 2025 అన్నదాతకు అన్ని విధాల చంద్రబాబు ప్రభుత్వంలో అష్టకష్టాలు తప్పలేదు.
పంట అమ్ముకోవడానికీ అవస్థలు
పంటను అమ్ముకోవడానికి అన్నదాతలు అవస్థలు పడాల్సిన పరిస్థితి చంద్రబాబు సర్కార్ కల్పించింది. మిల్లర్లు, దళారులు కుమ్మక్కు అయి ధాన్యం ముందే మిల్లు వద్ద దించేస్తున్నారు. బ్యాంకు గ్యారంటీలు కట్టేది మిల్లు యాజమానులే కావడంతో బ్యాంకు గ్యారంటీ కట్టిన వెంటనే దళారులకు చెప్పడంతో వారు ఽ ట్రక్ షీట్స్ జనరేట్ చేసుకుని మిల్లులో ఽముందుగా దించిన ధాన్యంకు అకనాలిడ్జిమెంట్ చేసుకుంటున్నారు. రోజులు తరబడి ధాన్యం బస్తాలు కళ్లాలో ఉంచుకుని నిరిక్షించాల్సిన పరిస్థితి. కొంతమంది నిరిక్షించే ఓపిక లేక దళారులకు తక్కువ ధరకు విక్రయించేస్తున్నారు.
కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ అందని వైనం
భూమిని కౌలుకు తీసుకుని సాగు చేసుకుని వాటిపై వచ్చే ఆదాయంతో కౌలు రైతులు జీవనం సాగిస్తారు. అటువంటి కౌలు రైతులను మానవత్వంతో ఆదుకోవాల్సిన చంద్రబాబు సర్కార్ అన్నదాత సుఖీభవ సాయం అందించకుండా హ్యాండ్ ఇచ్చింది. దీంతో కౌలు రైతులతో పాటు సాధారణ రైతులకు కూడా చంద్రబాబు ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకంలో కోత విధించింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 2.74 లక్షల మంది రైతులకు వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారా సాయం అందిస్తే చంద్రబాబు సర్కార్ 2.27 లక్షల మందికి మాత్రమే సాయం అందించింది. 47 వేల మంది వరకు రైతులకు కోత విధించారు.
విత్తు దగ్గర నుంచి పంట అమ్ముకునే వరకు అన్నీ కష్టాలే..
వర్షాలు సకాలంలో కురవక సాగు ఆలస్యం
తర్వాత ఎరువుల కోసం అవస్థలు
తుఫాన్ కారణంగా పంటలకు నష్టం
కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ సాయం ఇవ్వని చంద్రబాబు సర్కార్
80 కేజీల ధాన్యం బస్తాకు అదనంగా 2నుంచి 4 కేజీలు వసూలు
మద్దతు ధరలోనూ కోత
అన్నదాతకు కలిసిరాని 2025
అన్నదాతకు కలిసిరాని 2025
అన్నదాతకు కలిసిరాని 2025


