చంద్రబాబు పాలన కష్టాలమయం | - | Sakshi
Sakshi News home page

చంద్రబాబు పాలన కష్టాలమయం

Dec 31 2025 8:44 AM | Updated on Dec 31 2025 8:44 AM

చంద్రబాబు పాలన కష్టాలమయం

చంద్రబాబు పాలన కష్టాలమయం

రెండేళ్లలో ప్రజా వ్యతిరేకతను మూట గట్టుకున్న చంద్రబాబు ప్రభుత్వం

జెడ్పీ చైర్మన్‌, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు

విజయనగరం: ఎన్నికలకు ముందు అధికారమే ధ్యేయంగా హమీలు గుప్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ పాలన ప్రజలకు కష్టాలమయంగా మారిందని ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్‌ చైర్మన్‌, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు విమర్శించారు. ధర్మపురిలో గల సిరిసహస్ర రైజింగ్‌ ప్యాలెస్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం రెండేళ్లు పూర్తికాక ముందే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందని తెలిపారు. ఇందుకు 2025 సంవత్సరంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, ప్రజల పడిన ఇబ్బందులు, వ్యక్తమైన వ్యతిరేకతలే తార్కాణంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బాధ్యత గల ప్రతిపక్షంగా మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ జాతీయ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నామని వివరించారు.

సంక్షోభంలో వ్యవసాయ రంగం

చంద్రబాబు అధికారంలోకి వస్తే రైతాంగానికి కష్టలు తప్పవన్న నానుడి మరోసారి నిజమవుతోందని మజ్జి శ్రీనివాసరావు పేర్కొన్నారు. రైతాంగానికి అవసరమైన విత్తనాలు, ఎరువులు, గిట్టుబాటు ధరలు దక్కకపోగా.. సాగు కోసం చేస్తామన్న అన్నదాత సుఖీభవ సాయం అందకుండా పోతుందన్నారు. బస్తా యూరియా కోసం రైతులు రోజులు తరబడి నిరీక్షించటంతో పాటు లాఠీ దెబ్బలు తినటం ప్రభుత్వ పాలనకు అద్దం పడుతుందని ధ్వజమెత్తారు.

ఆరోగ్యశ్రీని నిలిపివేసి...

మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ

పేద ప్రజలకు సైతం కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలనే సత్సంకల్పంతో దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెడితే ఆ పథకానికి పేర్లు మార్చుకోవటమే కాకుండా చివరికి సేవలు నిలిపివేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. వైద్య రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని దుమ్మెత్తిపోశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేద ప్రజలకు వైద్యం, వైద్య విద్య అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను నిర్మిస్తే వాటిని ప్రైవేటీకరణ చేయటం దుర్మార్గపు చర్యగా పేర్కొన్నారు.

క్షీణించిన శాంతిభద్రతలు

రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందని తెలిపారు. ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా స్వచ్ఛందంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలను నిర్వహించుకుంటే ఓర్వలేని కూటమి నేతలు వారిపై కక్షపూరితంగా కేసులు పెట్టడం తగదన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో సైతం శాంతిభద్రతలు పూర్తిగా గాడి తప్పాయన్నారు. హత్యలు, అరాచకాలు, దాడులు, గంజాయి అక్రమరవాణా రోజురోజుకు పెచ్చుమీరుతుందన్నారు. ఎన్నికలకు ముందు రూ.1 కరెంట్‌ ఛార్జీ పెంచమని చెప్పి వివిధ రూపాల్లో ప్రజల నుంచి ముక్కు పిండి ఛార్జీలు వసూలు చేస్తున్నారన్నారు. పారిశ్రామిక ప్రగతి జాడ లేదని, ఉన్న పరిశ్రమలు మూతపడుతున్నా పట్టించుకున్న నాధుడు లేడన్నారు. వైఎస్సార్‌సీపీలో ప్రారంభమైన భోగాపురం అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులను అంతా తామే చేస్తున్నామంటూ ఫొటోలకు ఫోజులివ్వటం సిగ్గుచేటన్నారు.

సూపర్‌ సిక్స్‌ లేదు..

కొత్తగా ఒక్క పింఛను మంజూరు లేదు

చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికలకు ముందు చేసిన సూపర్‌ సిక్స్‌ హమీలపై మజ్జి శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సూపర్‌ సిక్స్‌ లేదు... రెండేళ్లలో ఒక్క కొత్త పింఛను మంజూరు చేయలేదని చెప్పారు. 2019 సంవత్సరంలో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా 39 లక్షల పింఛన్లు ఉంటే 2024 ఎన్నికల సమయానికి 66.34 లక్షల మందికి ఆ సంఖ్య పెరిగిందన్నారు. అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొత్త పింఛన్లు ఇవ్వకపోగా సుమారు 5 లక్షలకు పైగా పింఛన్లు నిలిపివేశారన్నారు.

వైకుంఠ ఏకాదశి సందర్భంగా అన్ని వర్గాల ప్రజలకు మంచి జరగాలని, రానున్న ఏడాదిలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా పార్టీ కార్యదర్శులు కెవి.సూర్యనారాయణరాజు, నెక్కల నాయుడుబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శులు వర్రి నర్సింహమూర్తి, ఇప్పిలి అనంత్‌, జిల్లా ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు పీరుబండి జైహింద్‌కుమార్‌, జిల్లా అధికార ప్రతినిధి కనకల రఘురామారావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement