
బంగారం చోరీ
గంట్యాడ: మండలంలోని కరకవలస పరిధి జగదాంబ నగర్‌లో తులం ముప్పావు బంగారం చోరికి గురైంది. జగదాంబనగర్‌లో నివాసముంటున్న కుప్పిలి శ్రీరామమూర్తి ఇంట్లో శనివారం రాత్రి ఎవరూ లేని సమయంలో ఇంటి తాళం విరగ్గొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు బీరువాలో ఉన్న ఒక్కటిన్నర తులాల గొలుసు, పావు తులం ఉంగరం ఎత్తుకెళ్లారు. దీనిపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై డి. సాయి కృష్ణ తెలిపారు.
ఇద్దరు యువతుల అదృశ్యం
విజయనగరం క్రైమ్: విజయనగరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు అమ్మాయిలు ఆదివారం అదృశ్యమయ్యారు. ఇందుకు సంబంధించి ఏఎస్సై రామలక్ష్మి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నగరంలోని అయ్యన్నపేటకు చెందిన అన్నదమ్ముల పిల్లలు ఇద్దరు (23) శనివారం ఇంటి నుంచి బయటకు వెళ్లారు. డిగ్రీ చదివిన ఇద్దరూ స్నేహితుల వద్దకు వెళ్లిఉంటారని వారి తల్లిదండ్రులు ఆదివారం మధ్యాహ్నం వరకు వేచి చూశారు. అమ్మాయిలిద్దరూ ఎంతకీ ఇంటికి రాకపోవడంతో అన్నదమ్ములిద్దరూ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ వకు వచ్చి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీఐ ఆర్వీఆర్‌కే.చౌదరి ఆదేశాలతో ఏఎస్సై రామలక్ష్మి మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
విద్యుత్‌షాక్‌తో విద్యార్థినికి గాయాలు
పాలకొండ రూరల్: స్థానిక ఎన్‌కే.రాజపురం ప్రాంతానికి చెందిన టి.యామిని అనే విద్యార్థిని పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. పాఠశాలలో ప్రత్యేక తరగతులకు హాజరైన ఆ విద్యార్థిని తిరిగి ఇంటికి వె వెళ్తున్న క్రమంలో విద్యుత్ షాక్‌కు గురై గాయాలపాలైంది. ఈ ఘటనపై బాధిత విద్యార్థిని తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఆదివారం సాయంత్రం ప్రత్యేక తరగతులకు హాజరయ్యేందుకు పాఠశాలకు ఆమె చేరుకోగా ఆ సమయంలో సహ విద్యార్థులు రాకపోవడంతో తిరిగి ఇంటికి బయల్దేరింది. ఆ సమయంలో పాఠశాల రహదారిలో ఎదురుగా వస్తున్న వాహనం నుంచి తప్పుకోబోతున్న క్రమంలో అక్కడి ప్రహరీ వద్ద ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ వైర్లు తగలడంతో షాక్‌కు గురైంది. ఈ క్రమంలో స్థానికులు గమనించి విద్యార్థినిని పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. షాక్ కారణంగా గాయాలు కావడంతో వైద్యు ప్రథమ చికిత్స అందించటంతో పాటు పోలీసులకు సమాచారం ఇచ్చారు. విద్యార్ధిని అందించిన వివరాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆర్థిక ఇబ్బందులతో
యువకుడి ఆత్మహత్య
లక్కవరపుకోట: ఆర్ధిక ఇబ్బందులు తాళలేక కుటుంబ పోషణ భారం కావడంతో మండలంలోని చందులూరు గ్రామానికి చెందిన కొటాన సంతోష్(26) మనస్తాపం చెందిన గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం జరిగిన ఈ ఘటనపై ఎస్సై నవీన్‌పడాల్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సంతోష్ విశాఖపట్నంలోని ఒక సంస్థలో ఆవుట్‌సోర్సింగ్ విభాగంలో పని చేస్తున్నాడు. తనకు వచ్చిన జీతం సరిపోక కుటుంబాన్ని పోషించుకోవడం భారమవడంతో శనివారం సాయంత్రం తన ఇంటి వద్ద గడ్డిమందు తాగేశాడు. దీంతో అపస్మారక స్థితిలో పడి ఉన్న సంతోష్‌ను కుటుంబసభ్యులు గుర్తించి ఎస్.కోట సీహెచ్‌సీకి, అక్కడి నుంచి విశాఖపట్నంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. విశాఖలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు.ఈ మేరకు మృతుడు తండి శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.

బంగారం చోరీ