
ఉపాధిహామీ పనుల్లో అవకతవకల గుర్తింపు
సీతానగరం: మండలంలోని గ్రామాల్లో నిర్వహిస్తున్న ఉపాధి హామీ పనులు, బిల్లుల చెల్లింపు, మస్తరు వేయడంలో అవకతవకలు జరుగుతున్నాయా? లేదా? అనే అంశంపై సామాజిక తనిఖీ సిబ్బంది గ్రామసభలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో చినంకలాంలో రామమందిరం వద్ద సర్పంచ్ పి.తిరుపతిరావు, గ్రామపెద్దల ఆధ్వర్యంలో ఆదివారం గ్రామసభ జరిగింది. మధ్యాహ్నం గ్రామసభ ప్రశాంతంగా ప్రారంభించినప్పటికీ క్షేత్ర సహాయకుడు బి. సత్యనారాయణ సమక్షంలో జాబ్ కార్డులు, ఉపాధి పనులుకల్పిం చడం, బిల్లుల చెల్లింపులపై వేతనదారులను సామాజిక తనిఖీ బృందం అడిగి తెలుసుకున్న సమయంలో వివిధ రకాల అభియోగాలు బయటపడ్డాయి. దీర్ఘ కాలంగా గ్రామాంతరం వెళ్లిన వారికి పనుల్లో పాల్గొనక పోయినా మస్తరు వేశారని, గర్భిణులు ప్రసవ సమయంలో పనుల్లో పాల్గొనక పోయినా, ప్రభుత్వం వద్ద గౌరవ వేతనం తీసుకుంటున్న వారికి, అనారోగ్యానికి గురైన వృద్ధులు ఏళ్ల తరబడి మంచాన పట్టిన వారికి, ఒకే ఇంట్లో ఉన్న భార్యాభర్తలు వేర్వేరు జాబ్‌కార్డులు పొంది వేతనాలు పొందినట్లు సామాజిక తనిఖీ సిబ్బంది గుర్తించారు. సామాజిక తనిఖీ సిబ్బంది గ్రామసభ నిర్వహించే సమయంలో గ్రామస్తులు ఒకరిపై ఒకరు అభియోగాలు చేసుకోవడం గొడవలకు దారితీసింది. దీంతో గ్రామంలోని రెండు వర్గాలు తోపులాటకు దిగాయి. ఈ విషయమై డీఆర్పీ గుంపస్వామి వద్ద ప్రస్తావించగా విజయవాడ, హైదరాబాద్, రాజమండ్రి తదితర దూర ప్రాంతాల్లో ఉన్నవారికి, వృద్ధులకు, గర్భిణులకు ప్రభుత్వం నుంచి గౌరవ వేతనాలు పొందుతున్న వారికి ఉపాధిహామీ బిల్లులు చెల్లించినట్లు గ్రామసభలో గుర్తించామన్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు లిఖిత పూర్వకంగా తెలియజేయనున్నట్లు చెప్పారు.

ఉపాధిహామీ పనుల్లో అవకతవకల గుర్తింపు