
ఉపాధిహామీలో ఇంజినీర్ల పాత్ర కీలకం
● పీఆర్ ఇంజినీర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
విజయనగరం రూరల్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో పంచాయతీరాజ్ ఇంజినీర్ల పాత్ర కీలకమని పీఆర్ ఇంజినీర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేసీహెచ్ మహంతి అన్నారు. ఈ మేరకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పీఆర్ ఇంజినీర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేసీహెచ్ మహంతి మాట్లాడుతూ ఎన్‌ఆర్‌ఈజీఎస్‌లో ఇంజినీరింగ్ విభాగం పాత్రను మరింత బలోపేతం చేయడం, విజిలెన్స్ ఆండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంలో ఎదురవుతున్న సిబ్బంది సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. సిబ్బంది సర్వీస్ రూల్స్ రూపకల్పన, సవరణలకు సంబంధించిన సూచనలు, ఉద్యోగుల పదోన్నతులు, బదిలీల సమస్యలను పరిష్కరించడమే అసోసియేషన్ లక్ష్యమన్నారు. గౌరవాధ్యక్షుడు షేక్ రియాజ్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అమలు చేయడంలో ఇంజినీర్ల పాత్ర కీలకమని, ప్రతి సభ్యుడు సమాజ అభివృద్ధికి కట్టుబడి పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి జి.వెంకటరెడ్డి, విజయనగరం జిల్లా అధ్యక్షుడు యు.సోములు, కార్యదర్శి కె.ప్రసాద్, కోశాధికారి వి.నీరజ, వివిధ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

ఉపాధిహామీలో ఇంజినీర్ల పాత్ర కీలకం