దయనీయంగా ఆశ్రమ పాఠశాలలు | - | Sakshi
Sakshi News home page

దయనీయంగా ఆశ్రమ పాఠశాలలు

Oct 13 2025 6:16 AM | Updated on Oct 13 2025 6:18 AM

దయనీయంగా ఆశ్రమ పాఠశాలలు

గిరిజన విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి కరువు

పార్వతీపురం రూరల్‌: భవిష్యత్‌ భారత పౌరులను తీర్చిదిద్దాల్సిన బడులు, కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో విద్యార్థులకు నరక కూపాలుగా మారుతున్నాయి. గిరిజన విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తును అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఆశ్రమ పాఠశాలలు, నేడు కనీస సౌకర్యాలకు నోచుకోక వారి పాలిట శాపాలుగా పరిణమించాయి. పార్వతీపురం మండలంలోని రావికోన గిరిజన ఆశ్రమ బాలుర పాఠశాలలో నెలకొన్న దయనీయ పరిస్థితులే ఇందుకు నిలువుటద్దం. సుమారు 150 మంది విద్యార్థులున్న ఈ పాఠశాలలో, చదువుకోవాలన్నా, పడుకోవాలన్నా, భోజనం చేయాలన్నా అన్నీ ఒకే చోట కావడం వారి దుస్థితికి అద్దం పడుతోంది. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు సరిపడా గదులు లేకపోవడం పెను సమస్యగా మారింది. ఉన్న కొద్దిపాటి గదులనే తరగతులకు, భోజనశాలకు, శయన మందిరానికి వినియోగిస్తున్నారు. పగలు ఎక్కడైతే అక్షరాలు దిద్దుతారో, రాత్రి అక్కడే పక్కలు వేసుకుని నిద్రించాల్సిన దుస్థితి నెలకొంది. ఈ గదులు కూడా విద్యార్థులందరికీ సరిపోకపోవడంతో, అనేకమంది చలికి, దోమల బెడదకు ఓర్చుకుంటూ వరండాలలోనే నిద్రకు ఉపక్రమిస్తున్నారు. తమ బట్టలు, పుస్తకాలు దాచుకునే పెట్టెలను మెట్ల కింద పెట్టుకుని, అక్కడే ఒరిగిపోతున్న చిన్నారుల పరిస్థితి దయనీయంగా ఉంది.

మంచి నీటికి మంగళం

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఆర్‌ఓ మినరల్‌ వాటర్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే, రావికోన పాఠశాలలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఇక్కడ తాగే నీటికి, ఇతర అవసరాలకు ఒకే ట్యాంక్‌ నీటిని వినియోగించాల్సి వస్తుండడం విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటమాడటమేనని తల్లిదండ్రులు, గిరిజన సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిశుభ్రమైన తాగునీరు అందించడంలో అధికారులు చూపుతున్న నిర్లక్ష్యం గిరిజన విద్యార్థుల పట్ల వారికున్న చిత్తశుద్ధిని ప్రశ్నిస్తోంది. ప్రభుత్వం, సంబంధిత శాఖ పరమైన అధికారులు తక్షణమే స్పందించి రావికోన ఆశ్రమ పాఠశాలలో అదనపు గదుల నిర్మాణం చేపట్టాలని, సురక్షితమైన తాగునీటి సౌకర్యం కల్పించాలని, విద్యార్థులకు కనీస మౌలిక వసతులు అందించి వారి భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలని గిరిజన సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు.

దయనీయంగా ఆశ్రమ పాఠశాలలు1
1/2

దయనీయంగా ఆశ్రమ పాఠశాలలు

దయనీయంగా ఆశ్రమ పాఠశాలలు2
2/2

దయనీయంగా ఆశ్రమ పాఠశాలలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement